Rain | సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గ్రేటర్లో ఆదివారం పలు చోట్ల వర్షం కురిసింది. రాత్రి 8 గంటల వరకు రాజేంద్రనగర్, శివరాంపల్లి, శాస్త్రీపురంలో అత్యధికంగా 3.0 సెం.మీలు, గోల్కొండలో 1.65, పాతబస్తీ చందూలాల్ బారాదరి, సులేమాన్‌నగర్‌లో 1.48, చాంద్రాయణగుట్ట, గచ్చిబౌలిలో 1.33, షేక్‌పేట, కిషన్‌బాగ్, ఖాజాగూడలో 1.12 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
వాయుగుండం ప్రభావంతో మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో ఉష్ణోగ్రత గరిష్ఠం 28.5, కనిష్ఠం 23.4 డిగ్రీలు, గాలిలో తేమ 91 శాతంగా నమోదైనట్లు తెలిపారు.