సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రజా పాలనలోని దరఖాస్తుల డిజిటలైజేషన్ కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్న పాత నేరస్థుడితోపాటు అతడికి సహకరిస్తున్న మరో ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు.
సూర్యపేట జిల్లా జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన షేక్ బడే సాహెబ్ అలియాస్ షేక్ మున్నా 2016లో కోదాడలో డిగ్రీ పూర్తిచేసి హైదరాబాద్కువచ్చి ఎల్బీనగర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్లిక్సి సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలో రెండేండ్లు పనిచేసి ఒక వ్యక్తికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేయడంతో కేసు నమోదయ్యింది.
ఈ కేసులో అరస్టై.. బెయిల్‌పై బయటకు వచ్చి.. 2021లో ‘లక్ష్మణ్ కార్పొరేట్స్” పేరుతో దిల్‌సుఖ్‌నగర్‌లో కన్సల్టెన్సీ ప్రారంభించాడు. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల కు చెందిన డిజిటలైజేషన్ వర్క్‌లకు సంబంధించిన కాంట్రాక్టులు చేసేవారి వద్దనుంచి సబ్ కాంట్రాక్టులు తీసుకొని స్కానింగ్, డాక్యుమెంటేషన్, డేటా ఎంట్రీ పనులు చేశాడు. 2023లో ఎల్బీనగర్ సీవైఈ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఐటీ, నాన్ ఐటీ సొల్యూషన్ మరో సంస్థను ప్రారంభించాడు.
లక్ష్మణాచారి, రామస్వామిలను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్లలోని ఎఫ్‌సీఐ, ఎస్బీఐ బ్యాంకు, కోర్టుల్లో ఔట్సోర్సింగ్, ఏజీ ఆఫీస్, పోస్టాఫీస్, రైల్వే, ఇన్‌కం ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్, జీఎస్టీ, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీలతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బ్యాక్‌డోర్ నుంచి ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ముగ్గురు స్నేహితులు తమ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటూ ప్రధాన నిందితుడైన షేక్ మున్నాతో మాట్లాడారు. తాను ఉద్యోగాలిప్పిస్తానంటూ వారివద్ద నుంచి రూ. 28 లక్షలు వసూలు చేశాడు.
అయితే వాళ్లను ఔట్‌సోర్సింగ్‌లో సబ్ కాంట్రాక్టు నిర్వహించే వారివద్ద పనుల్లో చేర్పించి, ఫేక్ ఐడీ కార్డులు, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు అందజేశాడు. మూడు నెలల తర్వాత బాధితులు నిలదీయగా.. మీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, మొదట్లో అనుభవం కోసం ఇలా ఔట్‌సోర్సింగ్‌లో పనిచేయాల్సి ఉం టుందంటూ నమ్మించారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయడంతో షేక్ మున్నా మోసాల విషయం తెలిసింది.
బాధితులు పోచారం ఐటీ కారిడార్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అలాగే ప్రజాపాలనలో గృహా జ్యోతి, గృహాలక్ష్మిలకు సంబంధించిన డాక్యుమెంట్లు డిజిటలైజేషన్‌కు సంబంధించిన కాం ట్రాక్టు ఇప్పిస్తానంటూ కోదాడకు చెందిన మరో వ్యక్తి వద్ద రూ. 33 లక్షలు వసూలుచేసి ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చాడు. సూర్యపేటకు చెందిన మరో వ్యక్తి వద్ద మద్యం దుకాణం ఇప్పిస్తానంటూ రూ. 10 లక్షలు వసూలు చేశాడు.
ఇలా షేక్ మున్నా, లక్ష్మణాచారి, రామస్వామిలు ఒక ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతుండగా బెంగళూర్‌కు చెందిన మహ్మద్ మాలిక్, వెస్ట్‌బెంగాల్‌కు చెందిన అకాశ్లు నకిలీ ఐడీ కార్డులు, నకిలీ అపాయింట్మెంట్లు తయారుచేసి వీళ్లకు అందించారు.
ఎల్బీనగర్ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ నేతృత్వంలోని బృందం పోచారం ఐటీ కారిడార్ పోలీసులతో కలిసి ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి రూ. 4 లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్‌తోపాటు వివిధ డిపార్టుమెంట్లకు సంబంధించిన నకిలీ లేఖలు, ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల పోలీసులు కోసం గాలిస్తున్నారు.