Hyderabad | బంజారాహిల్స్, మార్చి 12 : తనతో పాటు గదిలో ఉంటున్న యువతిని కులం పేరుతో దూషించడమే కాకుండా తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు యువతులపై ఫిలింనగర్ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కాకినాడ ప్రాంతానికి చెందిన ప్రత్యూష(24) అనే యువతి డిజైనర్‌గా పనిచేస్తూ షేక్‌పేట సమీపంలోని అలంరాహ కాలనీలో పది నెలలుగా షేరింగ్ రూమ్‌లో షేక్ అంజుమ్, రోజలైన్ అనే యువతులతో కలిసి ఉంటోంది. గత కొంతకాలంగా వారిద్దరూ ప్రత్యూషతో అకారణంగా గొడవకు దిగడం, ఆమెను కులం పేరుతో దూషించడం ప్రారంభించారు. తమ గదిలోకి అనుమతి లేకుండా యువకులను తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా తాను అడ్డుకున్నానని, దీంతో తనను టార్గెట్ చేస్తూ తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నారని, తన అనుమతి లేకుండా తన ఫోన్ తీసుకుని వేరే యువకులకు మెసేజెస్ పంపి తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బాధితతురాలు బుధవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనను పలుమార్లు కొట్టి గదిలో బంధించారని, తమ జోలికి వస్తే తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను పిలిపించి రేప్ చేయిస్తామంటూ బెదిరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులు షేక్ అంజుమ్, రోజలైన్ అనే యువతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 115(2), 351(3), 352 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.