కవాడిగూడ, డిసెంబర్ 10: ఎస్సీ వర్గీకరణకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని పలువురు దళిత సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వారు కోరారు. ఈ మేరకు శనివారం కవాడిగూడలోని బండమైసమ్మనగర్లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దండోరా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జన్ను కనకరాజు, రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్ మాదిగ, మాదిగ ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజలింగం, మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు వేముల బలరామ్, ఉద్యోగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సాయినాథ్ మాదిగ, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దళితులను విస్మరించి చిన్నచూపు చూస్తుందని వారు ఆరోపించారు. అత్యధిక జనాభా కలిగిన మాదిగల కోసం తక్షణమే ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించాలని అన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా అమలు జరగడానకి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మహిళా రాష్ట్ర నాయకురాలు సరస్వతి విజయ, సంఘం నేతలు యాకన్న, లింగన్న, శ్రీనివాస్, రవితో పాటు వివిధ దళత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రేపు చలో ఢిల్లీ…
కవాడిగూడ, డిసెంబర్ 10: ఎస్సీ 57 ఉప కులాలను ‘ఏ’ వర్గంలో చేర్చేతూ ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరుతున్నామని ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం తెలిపారు. శనివారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగిన ఎస్సీలలో 34 శాతం ఉన్న దళితులతో అత్యంత వెనుకబడిన 57 ఉపకులాల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆదిముల్ల వెంకటేశ్ హోలియదాసరి, రాయిల లక్ష్మీ నర్సయ్య చిందు, బుచ్చన్న గోసంగి, మల్లెల సాయి చరణ్, ముప్పాళ్ల సుధాకర్ బైండ్ల, రాగిశెట్ట పెంటయ్య, పోతుల మల్లేశ్, బాలరాజు మాదసి కురువ, శ్రీకాంత్, లక్ష్మణ్, పవన్ పాల్గొన్నారు.