SBI | సిటీబ్యూరో, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): బ్యాంక్ అధికారి సహకారంతో నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా.. ప్రభుత్వ ఉద్యోగులమంటూ నకిలీ పే స్లిప్‌లు పెట్టి ఎస్బీఐ బ్యాంక్ నుంచి రూ.4.8 కోట్ల రుణం తీసుకుని మోసగించిన 8 మందిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ కథనం ప్రకారం.. ఎస్బీఐ సనత్‌నగర్ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేసిన కార్తిక్ రాయ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి 2020- 2023 మధ్య కాలంలో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ స్కీమ్, మరణించిన వారికి సంబంధించిన ైక్లెమ్స్ నిధులే కాకుండా ఇతరులకు మంజూరైన రుణాలకు సంబంధించిన డబ్బును వారి అనుమతి లేకుండా థర్డ్ పార్టీకి మళ్లించాడు.
ఫోర్జరీ సంతకాలతో సృష్టించిన నకిలీ పత్రాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన బోగస్ పే స్లిప్‌లపై ఎలాంటి విచారణ లేకుండానే కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశాడు. ప్రతి లోన్‌పై 5శాతం కమీషన్ తీసుకున్నాడు. ఈ క్రమంలో మట్టేపల్లి శ్రీశాంత్ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజస్ ఫర్ గర్ల్స్ ఉద్యోగిగా నకిలీ పే స్లిప్‌తో సనత్‌నగర్ ఎస్బీఐ నుంచి అప్పటి మేనేజర్ కార్తిక్‌రాయ్ సహకారంతో రూ.15 లక్షల రుణం పొందాడు. పోలె విశాల్ సైతం రూ.15 లక్షల రుణం తీసుకున్నాడు.
ఈ విధంగా రూ.4.8 కోట్ల వరకు బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టారు. ఈ కుంభకోణంలో దాగల రాజు రుణ గ్రహీతలను ఎంపిక చేయడం, సుధాన్షు శేఖర్ అవసరమైన నకిలీ డాక్యుమెంట్స్‌ను సృష్టించడం, ఎండీ వాజీద్ నకిలీ రుణగ్రహీతలను సమన్వయం చేయడం, వారికి సునీల్‌కుమార్ సహకరించడం, భాస్కర్‌గౌడ్ సంబంధిత రబ్బర్ స్టాంపులు చేసి ఇచ్చాడు. ఫోర్జరీ, నకిలీ సాలరీ స్లిప్పులు, ఐడీ కార్డులను సృష్టించడం తదితర నేరాలకు పాల్పడ్డారు. కార్తిక్ రాయ్ ఉద్యోగ విరమణ పొందిన తరువాత అతడి వ్యవహారం బయటపడింది.
ప్రస్తుత మేనేజర్ రామచంద్ర రాఘవేంద్ర ప్రసాద్ ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు కార్తిక్ రాయ్‌ను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు ఈఓడబ్ల్యూ పోలీసులు చేపట్టారు. నకిలీ పత్రాలతో రుణాలు పొందడం, వారికి సహకరించిన మరో 8 మంది నిందితులను గురువారం అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి ఆదేశాల మేరకు ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ పర్యవేక్షణలో ఏసీపీ రవీందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.