కుత్బుల్లాపూర్, మార్చి15: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ సరోజినీగార్డెన్ స్థలం వివాదాస్పదంగా మారింది. పేట్‌బషీరాబాద్ విలేజ్‌లోని సర్వే నంబర్ ‘48/పీ’ లో 5807 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సరోజినీ గార్డెన్ సైతం ఉంది. ఇటీవల ఆ స్థలంలో బహుళ అంతస్తులు నిర్మించేందుకు కొంతమంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి అనుమతులు పొందారు. ఇది తెలుసుకున్న స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఈ యూఎల్సీ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని డిసెంబర్ 11న బోర్డులు ఏర్పాటు చేశారు.
ఈ బోర్డులు కబ్జాదారులు తొలగించగా సమాచారం అందుకున్న కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు మార్చి 13న తిరిగి బోర్డులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా కొంతమంది భూ ఆక్రమణదారులు అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ బోర్డులను ఏర్పాటు చేయకుండా అడ్డు తగిలారు. దీంతో ఆర్ఐ విజయ్‌కుమార్ పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారుల విధులకు భంగం కలిగించిన డి.రథన్ కుమార్, శ్రీనివాసరావు, డి.శేఖర్ బాబు, డి. వెంకట్ రావు, డి.సతీశ్‌బాబుపై ఫిర్యాదు చేయగా వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జీడిమెట్ల విలేజ్ గాంధీ విగ్రహం వద్ద ఉన్న సరోజినీ గార్డెన్‌ను డెవలప్మెంట్ చేసేందుకు కొంత మంది వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి అనుమతులు పొందారు. సరోజినీ గార్డెన్‌ను ఆనుకొని ఉన్న యూఎల్‌సీకి చెందిన సర్వే నంబర్ ‘48/పీ’ ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం ఈ స్థలంలో అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడం.. సరోజినీ గార్డెన్ సైతం ఈ భూముల్లోనే ఉండటం కొసమెరుపు.
జాతీయ రహదారి 44కు ఆనుకొని ఉన్న సరోజినీ గార్డెన్ స్థలం విలువ కోట్లలో ఉంది. ఈ గార్డెన్‌కు ఆనుకొని ఉన్న యూఎల్సీ స్థలాన్ని సైతం కబ్జా చేసేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ పాత్ర గణనీయంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ స్థలంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి బహుళ అంతస్తుల నిర్మాణం కోసం అనుమతులు పొందారు. గుట్టు చప్పుడు కాకుండా స్థలంలో బహుళ అంతస్తులు నిర్మించేందుకు పూనుకున్నారు. అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగి యూఎల్సీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.
దీంతో సదరు ఎమ్మెల్సీ కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ స్థలాన్ని పరిశీలించాలని కోర్టు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అధికారులు ఆ స్థలాన్ని ప్రభుత్వానికి చెందినదిగా తేల్చింది. ఇంత జరిగినా ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంత మంది పూనుకొని అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించడంతో ఆక్రమణదారులపై రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.