Saree Run | హైదరాబాద్ : హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం శారీ రన్ నిర్వహించారు. ఈ రన్లో 3 వేల మందికి పైగా అతివలు పాల్గొన్నారు. ఈ శారీ రన్‌ను టాటా సంస్థకు చెందిన తనైరా బ్రాండ్, బెంగళూరుకు చెందిన ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ కలిసి నిర్వహించాయి.
హైదరాబాద్ ఎడిషన్‌కు సంబంధించి తనైరా శారీ రన్‌ను తనైరా సీఈవో అంబుజ్ నారాయణ, జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ కలిసి ప్రారంభించారు. ఇక మహిళలంతా చేనేత చీరలు ధరించి రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేటి తరానికి చీర యొక్క ప్రాధాన్యతను తెలియజేసేందుకే ఇలాంటి రన్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో శారీ రన్‌ను విజయవంతంగా నిర్వహించామన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. మహిళలకు చీర ప్రాధాన్యం గురించి తెలియజేస్తూనే, వారికి ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గతేడాది కంటే ఈ సంవత్సరం శారీ రన్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఇది తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. శారీ రన్లో పాల్గొన్న మహిళలందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నిర్వాహకులు.