సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, హైదరాబాద్ నగరాన్ని అందంగా ఉంచడంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ వర్కర్లదే కీలక పాత్ర అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బంజారాహిల్స్ కొమురం భీం భవన్లో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. హెల్త్ క్యాంప్‌లో మంత్రి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
అనంతరం జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి వ్యక్తిగత పరికరాల కిట్స్‌ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తదితరులు పాల్గొన్నారు.
3వేలకు పైగా ఆలయాల్లో బోనాల ఉత్సవాలు
అంబర్‌పేట, జూలై 8: అంబర్‌పేట మహంకాళి దేవాలయం వద్ద నియోజకవర్గంలోని అమ్మవారి దేవాలయాలకు ఎండోమెంట్ ద్వారా అందించే చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. జంట నగరాలలో 3వేలకు పైగా దేవాలయాల్లో బోనాల ఉత్సవాల నిర్వహిస్తున్నామన్నారు.
అన్ని దేవాలయలకు బోనాల నిర్వహణ ఖర్చు కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసిందని, వీటికి సంబంధించిన చెక్కుల పంపిణీ పూర్తిచేశామన్నారు. ఈ సందర్భంగా అంబర్‌పేట నియోజకవర్గంలో మొత్తం 139 అమ్మవారి దేవాలయాలకు సంబంధించి రూ.55.29 లక్షల చెక్కులను అందించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కార్పొరేటర్లు బీ పద్మావెంకటరెడ్డి, దూసరి లావణ్య, విజయ్‌కుమార్‌గౌడ్, అమృత, ఉమా రమేష్ యాదవ్, అధికారులు, దేవాలయాల నిర్వాహకులు పాల్గొన్నారు.