సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సోమవారం నుంచి మరోసారి జీహెచ్ఎంసీ వ్యాప్తంగా శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. శనివారం సికింద్రాబాద్, మల్కాజిగిరి జోన్లలో కమిషనర్ ఆర్వీ కర్ణన్ సంబంధిత జోనల్ కమిషనర్లు రవి కిరణ్, మల్కాజ్గిరి జోన్ కమిషనర్ సంచిత్ గంగ్వార్లతో కలిసి క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు.
పారిశుద్ధ్య పనులు ప్రభావవంతంగా జరిగేలా మానిటరింగ్ చేయాలని కమిషనర్ జెడ్సీ, డీసీలకు సూచించారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌లో దీర్ఘకాలంగా పేరుకుపోయిన వ్యర్థాలు, గార్భేజ్ వల్నరబుల్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సికింద్రాబాద్ జోనల్ పరిధిలోని గాంధీ ఆసుపత్రి, దాని చుట్టు పక్కల ప్రాంతాలలో ప్రజా భద్రత, పారిశుద్ధ్య, పాదాచారుల మౌలిక సదుపాయాలకు సంబంధించిన పరిస్థితులను కమిషనర్ ఆర్వి కర్ణన్ తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో వీధి కుక్కల సమస్యను కమిషనర్ తీవ్రంగా పరిగణించారు.
ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు తరలించబడిన కుక్కలు చుట్టు పక్కల ప్రాంతాల నుండి ఆసుపత్రి ప్రాంగణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నట్లు కమిషనర్ గుర్తించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించడానికి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ (సీవీఓ), వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్‌తో కలిసి సంయుక్త తనిఖీ నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలోని కుక్కలను పట్టుకుని యానిమల్ కేర్ సెంటర్‌కు తరలించాలని చెప్పారు. కుక్కల బెడద లేకుండా చూడాలని చెప్పారు. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి వెటర్నరీ అధికారులు తమ పరిధిలోని అన్ని దవాఖానాలు, పాఠశాలలు, జన సాంద్రత ప్రదేశాలలో రోజువారీగా వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, వీధి కుక్కలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్ పేర్కొన్నారు.
ఆసుపత్రులు, పాఠశాలలు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలలో కుక్క కాటు ఘటనలు జరిగితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వీధి కుక్కల బెడదపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. ఫుట్‌పాత్‌లపై పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించడం ద్వారా ఫుట్‌పాత్‌లను వెంటనే పునరుద్దరించాలని అధికారులను ఆదేశించారు. మల్కాజ్గిరి జోనల్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్‌లో గార్భేజ్ వల్నరబుల్ పాయింట్లను కమిషనర్ పరిశీలించారు.