సిటీబ్యూరో, జూన్15, (నమస్తే తెలంగాణ): వాళ్లంతా చిన్నపాటి జీతంతో బతుకులీడ్చేవాళ్లు. సామాన్య ప్రజలకు వైద్యమందించే సర్కారు దవాఖానలను శుభ్రపరిచేవారు. ఆ ఆసుపత్రులను కాపుకాసేవారు. కా నీ వారి రెక్కల కష్టం విలువ నెలకు రూ. 11000లు మాత్రమే. ఆ జీతం కూడా ఐదు నెలలుగా ఆపేయడంతో వారంతా అ ప్పులు చేసి కుటుంబాలను పోషిస్తున్నారు.
తెలంగాణ వైద్యవిధాన పరిషత్(టీవీవీపి) పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక పట్టణ కేంద్రాలలో పనిచేసే శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు అందలేదు. బీఆర్ఎస్ పా లనలో ప్రతినెలా జీతాలు తీసుకున్న వాళ్లు, కాంగ్రెస్ పాలనలో పస్తులుండే పరిస్థితి ఏర్పడ్డది.
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో 3600కు పైగా సిబ్బంది శానిటేషన్, పేషెంట్‌కేర్, సెక్యూరిటీలుగా కాంట్రాక్ట్ ప్రాతిపాదికన విధులు నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కారులో మంత్రి హరీశ్ రావు చొరవతో వేతనాలు పెంచి, ప్రతినెల తప్పనిసరిగా వారి ఖాతాల్లో వేతనాలు జమ అయ్యేవి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సైతం ప్రభుత్వం నుంచి విడుదలైన వెంటనే సిబ్బంది ఖాతాల్లో వేతనాలు జమ చేసేవారు.
సకాలంలో ఈఎస్ఐ, పీఎఫ్‌లు సైతం చెల్లించేవారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పద్ధతికి స్వస్తి పలికింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతినెలా వేతనాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రతి నెల అందించే వేతనాలు కాస్త ఆరు నెలలకోసారి వేయడం ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి నుంచి కాంట్రాక్టర్లకు వేతనాల సొమ్ము విడుదల చేయకపోవడంతో సిబ్బందికి ఇవ్వాల్సిన వేతనాలు నిలిచిపోయాయి. ఐదు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆవేదనతో సిబ్బందంతా కలిసి కాంట్రాక్టర్లను నిలదీసినా ఫలితం శూన్యంగానే మిగిలింది.
రాష్ట్రవ్యాప్తంగా శానిటేషన్, పేషెంట్‌కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఐదు నెలలుగా సుమారు రూ.28 కోట్ల పెండింగ్ వేతనాలు చెల్లించాల్సి ఉంది. కానీ వాటిని ఇప్పటివరకు కూడా చెల్లించకపోవడం గమనార్హం. జీతాల కోసం అధికారులను కలిసి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోకుండావాటిని విస్మరిస్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే తమ బాధను విస్మరిస్తే ఎవరితో చెప్పుకోవాలంటూ వాపోతున్నారు.
ప్రతి నెల తీసుకునే జీతంలోనే ఇంటి అద్దెలు కట్టుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటున్న సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులుపడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. . పెరిగిన నిత్యావసర ధరల కారణంగా చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు కాంట్రాక్టర్ల టెండర్ ఈ ఏడాది మార్చిలోనే ముగిసినా ప్రభుత్వం కొత్త టెండర్‌కు ఆహ్వానం పలకలేదు. కనీసం కొత్తటెండర్ వచ్చి కాంట్రాక్టర్లు మారితేనైనా వేతనాలు పెంచుతారని ఆశతో ఎదురుచూస్తున్నారు. పెండింగ్ వేతనాలు విడుదల చేసి, కొత్త టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలి. ఐదు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉండటం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి. కొత్త టెండర్లు పిలిచి సిబ్బందికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
-నర్సింహ, మెడికల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఏఐటీయూసీ