హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ్చతలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తడి, పొడి చెత్త వేర్వేరుగా, ఇంటింటి చెత్త సేకరణ, కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం, ఓడీఎఫ్‌కు చర్యలు, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ చర్యలు, స్వచ్ఛతపై చైతన్య కార్యక్రమాలు, 50 మైక్రాన్ల కన్నా తక్కువ నిడివి ఉన్న ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలు పక్కాగా చేపట్టింది. చెత్తకుండీలు లేని నగరంగా తీర్చిదిద్దే క్రమంలో దాదాపు 22 లక్షల గృహాలకు ఒక్కో ఇంటికి తడి, పొడి చెత్త సేకరణకు 44 లక్షల చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఇంటింటికీ చెత్త సేకరణకు 4500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను వినియోగించారు. ఫలితంగా జీహెచ్ఎంసీకు ‘బెస్ట్ సెల్ఫ్ సైస్టెనబులిటీ అవార్డు, 3 స్టార్ రేటింగ్ సిటీగా హైదరాబాద్ నిలిచింది.
GHMC | సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోంది. నగరాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దాల్సిన బల్దియా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, వ్యాధుల నివారణకు ఏటా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా..లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోతున్నది. ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ, తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్-జీవీపీ) ఎత్తివేతలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
గ్రేటర్ వ్యాప్తంగా చెత్త డబ్బాలను ఎత్తి వేయగా, ఇప్పటికీ 2640 చోట్ల చెత్త కుప్పలున్నట్లు ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) ఇటీవల నిర్వహించిన సర్వేలో తేల్చడమే అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. బస్తీలు..కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. వివిధ వ్యాధులతో ప్రజలు అవస్థలుపడుతున్నారు. చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తున్నది. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ మొదలుకొని డిప్యూటీ కమిషనర్ల వరకు ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతున్నది.

చెత్త కుప్పలే దర్శనం..
గడిచిన కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా.. రహదారుల వెంట పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుపుతామన్న లక్ష్యం నీరుగారుతోంది. తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్) జీహెచ్ఎంసీ పరిధిలో 2640 ప్రాంతాలను గుర్తించి, వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
కానీ క్షేత్రస్థాయిలో వీటికి అదనంగా కొత్తగా జీవీపీ పాయింట్లు పుట్టుకొస్తున్నాయి. స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే పారిశుధ్యంపై ఫిర్యాదులు అధికం కావడం, ఇటీవల హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వయంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పారిశుధ్య నిర్వహణ ఏ మాత్రం బాగులేదని, తన డివిజన్లో చెత్త ఎత్తడం లేదని సంబంధిత అధికారులపై మండిపడ్డారు. వాస్తవంగా వర్షాకాలంలో వ్యర్థాలు త్వరగా కుళ్లి దుర్గంధం వెదజల్లే పరిస్థితులు ఎక్కువ. అయితే చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వర్షాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. ఇప్పటికే మలేరియా, డెంగీ కేసులు విజృంభిస్తున్నాయి.

పర్యవేక్షణ ఏదీ?
ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యం అమలు కావడం లేదు.గ్రేటర్‌ను చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా దాదాపు మూడున్నరేండ్ల్ల కిందట డస్ట్ బిన్ లెస్ సిటీ పేరుతో చెత్త కుండీలను జీహెచ్ఎంసీ ఎత్తేసింది. మెరుగైన పారిశుధ్య నిర్వహణను పకడ్బందీ చేస్తూ వందకు వంద శాతం ఇంటింటి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోల సంఖ్యను పెంచారు. సుమారు 5250 స్వచ్ఛ ఆటోల ద్వారా నగరంలో 4886 కాలనీల్లో 23 లక్షల గృహాల నుంచి రోజుకు 7వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త సేకరణ జరగాలి.
ఒకొక ఆటోకు కాలనీల వారీగా చూస్తే ఒకటి లేదా రెండు కాలనీలు గృహాల ప్రకారంగా గమనిస్తే ఒకొక అటోకు సుమారుగా 500 నుంచి 600 ఇండ్లను కేటాయించి, చెత్త సేకరణ జరపాలి. కానీ గడిచిన కొన్ని రోజులుగా స్వచ్ఛ ఆటోల పనితీరు సరిగా ఉండటం లేదు. చాలా కాలనీలకు రోజూ స్వచ్ఛ ఆటోలు రావడం లేదు. వందకు వంద శాతం స్వచ్ఛ ఆటోల అటెండెన్స్ ఉండటం లేదు. రోజూ 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని.. స్వయంగా గత కమిషనర్ రోనాల్డ్ రాస్ గుర్తించారు.
నేటికీ స్వచ్ఛ ఆటోల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోతున్నది. సమయ పాలన పట్టించుకోకపోవడం, చెత్త సేకరణలో అధిక వసూళ్లకు తెరలేపడం, సిటీలో ఉండాల్సిన స్వచ్ఛ ఆటోలు గ్రేటర్ సరిహద్దులు దాటుతుండటం గమనార్హం. ఇదే విషయంపై ఇటీవల కొత్త కమిషనర్ ఆమ్రపాలి సైతం స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుగుపర్చాలని, లేదంటే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.