సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోంది. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన బల్దియా.. ఆచరణలో విఫలమవుతున్నది. ముఖ్యంగా ఇంటింటికి తడి, పొడి చెత్త సేకరణ, తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) ఎత్తివేతలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అసలే వర్షాకాలం..ఆపై డెంగీ, మలేరియా వ్యాధుల విజృంభణ వెరసి గ్రేటర్ జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాలనీలు, బస్తీలలో ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త చెదారంలో దోమలు నివాసాలుగా ఏర్పర్చుకొని జనంపై దాడి చేస్తున్నాయి. వాటి బారిన పడుతున్న జనం జ్వరాలతో దవాఖానల్లో చేరుతున్నారు. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో పెరుగుతున్న డెంగీ, మలేరియా, ఇతర వ్యాధుల కేసులే నిదర్శనంగా చెప్పవచ్చు.
పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, వ్యాధుల నివారణకు ఏటా రూ. 300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా..లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా చెత్త డబ్బాలను ఎత్తి వేయగా, ఇప్పటికీ 2640 చోట్ల చెత్త కుప్పలున్నట్లు అస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా) ఇటీవల నిర్వహించిన సర్వేలో తేల్చడమే అధికారులపనితీరును ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడా చూసినా పెద్ద పెద్ద చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. వ్యర్థాలతో నిండిపోయినా బస్తీలు, కాలనీలు వెరసి దోమలతో దవాఖానల్లో పెరుగుతున్న వ్యాధి పీడితులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
దీనికి కారణం అడుగడుగునా కొందరి అధికారుల అవినీతి లెక్కలు, రికార్డుల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించని సిబ్బంది..కాగితాల్లో మాత్రమే కనిపించే చెత్త తరలింపు..మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ మొదలుకొని డిప్యూటీ కమిషన్ల వరకు ఆకస్మిక పర్యటనల లేమి వరకు లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఒక్క వీఐపీలు ఉండే ప్రాంతాలు, ప్రధాన రహదారులలో మాత్రమే పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా కనబడుతుందే తప్ప కాలనీలు, బస్తీలలో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
గడిచిన కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా.. రహదారుల వెంట పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి..తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్భేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) జీహెచ్ఎంసీ పరిధిలో 2640 ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో వీటికి అదనంగా కొత్తగా జీవీపీ పాయింట్లు పుట్టుకొస్తున్నాయి. స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగడం లేదు.
వాస్తవంగా వర్షాకాలంలో వ్యర్థాలు త్వరగా కుళ్లి దుర్గంధం వెదజల్లే పరిస్థితులు ఎక్కువ. దీని చక్కదిద్దేందుకు , చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వర్షాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు..వర్షాలొస్తే దోమలు, ఈగలు, క్రిమికీటకాలు వృద్ధి చెంది రోగాలు వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే మలేరియా, డెంగీ కేసులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.