రెండు దశాబ్దాల క్రితం ఎక్కడ ప్రాక్టీస్ ప్రారంభించిందో.. అక్కడే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటకు ముగింపు పలికారు. ఎల్బీస్టేడియంలో ఆదివారం జరిగిన ఫేర్వెల్ మ్యాచ్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానుల మధ్య ఆడిన సానియా విజయంతో వీడ్కోలు చెప్పారు. సొంతగడ్డపై జరిగిన ఆటలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. అనంతరం సాయంత్రం మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్లో సానియా మీర్జా ఫేర్వెల్ రెడ్ కార్పెట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. చివరి ఎగ్జిబిషన్మ్యాచ్ ఆడినటెన్నిస్ దిగ్గజం.
భారత టెన్నిస్‌లో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిన సానియా మీర్జా.. ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఆఖరి మ్యాచ్ ఆడింది. 20 ఏండ్ల కింద ఎక్కడ ప్రారంభించిందో అక్కడే సానియా కన్నీటితో ఆటకు వీడ్కోలు పలికింది. గత నెలలోనే ప్రొఫెషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా.. టెన్నిస్ ఓనమాలు నేర్చిన ఎల్బీ స్టేడియంలో ఆడాలనే ఉద్దేశంతో ఆదివారం ప్రత్యేక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొంది. ఈ పోరుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్, చాముండేశ్వరినాథ్, సినీ నటుడు దుల్కర్ సల్మాన్, మాజీ క్రికెటర్లు మహ్మద్ అజారుద్దీన్, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పతో పాటు పలువురు టెన్నిస్ ప్లేయర్లు హాజరయ్యారు.
అనన్య బిర్లా, హుమా ఖురేషీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా మ్యాచ్‌ను వీక్షించారు. సానియా చివరిసారి ఆడుతున్న మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరు కాగా.. రోహాన్ బోపన్న, క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో కలిసి సానియా మ్యాచ్‌లు ఆడింది. ఇక సానియా సహచరులు బెతానీ మాటెక్, ఇవాన్, కారా బ్లాక్, మారిన్ బార్టోలి కూడా చివరి మ్యాచ్‌కు తరలివచ్చారు. స్టేడియం మొత్తం సానియా.. సానియా.. అరుపులతో మోతెక్కిపోయింది. ఈ సందర్భంగా సానియా నాలుగేండ్ల కుమారుడు ఇజ్హాన్ మీర్జా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.