Sandhya Theatre | సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై థియేటర్ యాజమాన్యం స్పందించి సమాధానం ఇచ్చింది. ఈ నెల 4న సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకొని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి మృతి చెందగా, ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. సినిమా థియేటర్ యాజమాన్యానికి 15 రోజుల క్రితం షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, సరైన వసతులు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని, మీ థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదంటూ వివరణ కోరారు. ఇందులో భాగంగానే సినిమా థియేటర్ యాజమాన్యం ఆ నోటీసులకు బదులిస్తూ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. 45 ఏళ్లుగా థియేటర్‌ను నడిపిస్తున్నామని, గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని, పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్లో 80 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని, 4,5వ తేదీలలో థియేటర్‌ను మైత్రి మూవీస్ సంస్థ ఎంగేజ్ చేసుకుందని, గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా హిరోలు థియేటర్లో సినిమాలకు వచ్చిపోయారని, సంధ్య థియేటర్లో ఫోర్ వీలర్స్, టూ వీలర్స్‌కు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలున్నాయంటూ 6 పేజీలతో కూడిన వివరణను రాసి, తమ న్యాయవాదుల ద్వారా పోలీసులకు అందించారు.