సిటీబ్యూరో, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణులు అన్ని పార్టీల తరఫున తమకు అనుకూలమైన స్థానాల్లో పోటీచేయాలని, బ్రాహ్మణసంఘాలు ఎన్ని ఉన్నా తమ వారిని గెలిపించుకోవడంలో ఐకమత్యాన్ని చాటాలని మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి పిలుపునిచ్చారు. ఆదివారం బ్రాహ్మణ అఫీషియల్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్, బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని మైనింగ్ అసోసియేషన్ బిల్డింగ్‌లో బ్రాహ్మణ రాజకీయ రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
కార్యక్రమానికి హాజరైన సముద్రాల వేణుగోపాల చారి మాట్లాడుతూ.. బ్రాహ్మణులు వారి చాణక్యనీతిని, సేవాభావాన్ని , చతురతను ప్రదర్శించి అధిష్టానాన్ని మెప్పించి టికెట్లు పొందాలన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోటనీలిమ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణ యువత పోటీచేసేందుకు తనవంతుగా సహకరిస్తానన్నారు. బ్రాహ్మణులు క్షేత్రస్థాయిలో పనిచేసి స్థానికులను మెప్పించినప్పుడే తాము సుస్థిరతను సాధించగలుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సుశీల్‌కుమార్, ప్రధానకార్యదర్శి డా.వింజమూరిసుధాకర్, మహిళా అధ్యక్షురాలు యమునాపాఠక్, బిజెపి రాష్ట్ర అధికారప్రతినిధి సుభాష్, కార్పొరేటర్ శ్రవణ్‌కుమార్, కందుల రామకృష్ణ, రంగం సత్యం తదితరులు పాల్గొన్నారు.