Sabitha Indra Reddy | బడంగ్‌పేట, మే 23: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు పక్కన ప్రమాదానికి గురైన వ్యక్తులను గమనించిన ఆమె.. వారి వద్దకు వెళ్లి వారి పరిస్థితిని ఆరా తీశారు. అలాగే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. మహేశ్వరం గేటు వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుతున్న సిబ్బందిపైకి ద్విచక్రవాహనం దూసుకురావడంతో ఒక వృద్ధుడికి స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వివిధ వివాహ వేడుకలకు హాజరై హైదరాబాద్ నగరానికి బయల్దేరారు. ఈ క్రమంలో ప్రమాదం జరగడాన్ని గమనించిన సబితా ఇంద్రారెడ్డి తన కాన్వాయిని ఆపించారు. గాయపడిన వృద్ధుడి దగ్గరకు వెళ్లి అతడిని పరిశీలించారు. వృద్ధుడి పరిస్థితిని ఆరా తీసిన అనంతరం.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.