బడంగ్‌పేట, మే 3 : మున్సిపల్ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి వద్దే ఉంచుకొని ఏడాదిన్నర కాలంలో ఏ ఒక్క రోజూ మున్సిపల్ సమస్యలపై సమీక్షా సమావేశం పెట్టిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎస్ఎన్డీపీ పనులపై రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ శాఖలో కుప్పలు తెప్పలుగా సమస్యలు ఉన్నా.. పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో నిధులు కూడా కేటాయించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కూడా అధికారుల్లో సైతం లోపించిందన్నారు. మిథిలానగర్‌లో ముంపు సమస్యను చూసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైన నిధులు కేటాయించారని గుర్తు చేశారు. శివారు ప్రాంతాల్లో ఉన్న ముంపు సమస్యను పరిష్కరించేందుకు రూ. 850 కోట్లు గతంలో కేటాయించడం వల్లే ముంపు సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో కమిషనర్ సరస్వతి, డీటీ మణిపాల్ రెడ్డి,శ్యాంసుందర్ పాల్గొన్నారు.