బడంగ్‌పేట: కాంగ్రెస్ ప్రభుత్వానికి మతిమర్పు ఉందని, తీసుకున్న దరఖాస్తులను ఎన్నిసార్లు తీసుకుంటారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శంకుస్థాపనలు చేసిన పనులను వీలైనంత త్వరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత ధోరణితో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో నిధులు కేటాయించడం లేదన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్ మంజూరు చేసిన నిధులు ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.50కోట్లు, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు, జల్పల్లి మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, తుక్కుగూడకు రూ.25 కోట్లు గత ప్రభుత్వం మంజూరు చేసినా..వాటిని ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులతో ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతు బంధు ఇస్తామని చెప్పి తీసుకున్న దరఖాస్తులు బుట్టదాఖలు చేశారని ఎమ్మెల్యే అన్నారు. నిర్బంధాల మధ్య గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నారన్నారు.