బడంగ్‌పేట, ఆగస్టు15 : మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు చేయకుండా కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. గుర్రంగూడలో ముంపునకు గురైన కాలనీల్లో ఆమె పర్యటించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ముంపు సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా .. ఎమ్మెల్యే మాట్లాడుతూ బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో కార్పొరేటర్లు తీర్మానం చేసి.. టెండర్‌కు పిలిచిన కాపీలను కాంగ్రెస్ నాయకులు ఎత్తుకుపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో అభివృద్ధి కావాలి కానీ.. ఇతర డివిజన్లలో అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడం, అధికారులను బెదిరించడం మంచి పద్ధతి కాదన్నారు. గాంధీ భవన్ నుంచి ఏమైనా నిధులు తీసుకొస్తున్నారా అని ప్రశ్నించారు.
ఇతర కాలనీల ప్రజలు ఓట్లు వేయలేదా?.. పన్నులు కడ్తలేరా అని ప్రశ్నించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా చేయడం మానుకోవాలన్నారు. అభివృద్ధికి సహకరించాలి తప్ప.. ఆటంకం కల్పిస్తే ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ‘బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు టీడీలు రూ. 90 కోట్లు వచ్చాయని కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు కదా.. ఇప్పుడు ఆ నిధులు ఎందుకు ఇవ్వడం లేదో క్షీరాభిషేకం చేసిన నాయకులే చెప్పాలి’ అని అన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్లే మహేశ్వరం నియోజకవర్గంలో ముంపు సమస్య పరిష్కారమైందన్నారు. ఎస్ఎన్డీపీ నాలాలను అభివృద్ధి చేయడం ద్వారా మహేశ్వరం నియోజకవర్గంలో 70 కాలనీల్లో ముంపు సమస్య తప్పిందని చెప్పారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ బడంగ్‌పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మాజీ కౌన్సిలర్ గుర్రం సాయికిరణ్‌రెడ్డి, సత్తిరెడ్డి, జక్కిడి ముత్యంరెడ్డి తదితరులు ఉన్నారు.