కందుకూరు, జూన్ 12 : సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు సమాధానాలు చెప్పారు. ప్రత్యేక కార్యాచరణ రూపొందించి సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం చూస్తున్నట్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 14వేలకు పైగా ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూములను సేకరించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సీఎం రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క,సీతక్క, కోదండరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఫార్మాను రద్దు చేసి భూములను రైతులకు ఇస్తామని చెప్పారని, ఇప్పుడు ఎందుకు మాట మార్చి ప్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుందని కందుకూరు మండల ప్రజలకు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ప్యూచర్ సిటీకి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని అభివృద్ధిని ఎప్పడు కూడా అడ్డుకోమని స్పష్టం చేశారు. జైత్వారం, గపూర్నగర్ రోడ్డుతో పాటు నేదునూరు, బాచుపల్లి, పెరుగుగూడ నుంచి జైత్వారం రోడ్డును మంజూరు చేశామని పనులు ప్రారంభం కావాల్సి ఉందని తెలిపారు. ఎక్సైజ్, పోలీసు అధికారులతో మాట్లాడి బెల్టుషాపులను అరికడుతానని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అబద్ధాలతో కాలం గడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.