ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నది. రెండో రోజు సైతం నగర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ డిపోల ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రగిలిపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు అన్ని డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వివిధ డిపోల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేబీఎస్, రేతిఫైల్, ఎంజీబీఎస్ బస్టాండ్లల్లో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి నరకం చూడాల్సి వచ్చింది. ప్రైవేట్ వాహనాలు డబ్బులు అధికంగా వసూలు చేస్తూ దండుకుంటున్నాయి. మరోవైపు డిపోల ఎదుట పెద్ద ఎత్తున మహిళలు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ)
ఇదిలా ఉంటే నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెరుగైన చికిత్స కోసం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటనపై ఆర్టీసీ జేఏసీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ.. తమ డ్రైవర్‌కు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. డిమాండ్లను పరిష్కరించలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే తాము అడిగామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం సరైందని కాదని చెప్పారు. మరోవైపు అద్దె బస్సులను పోలీసు పహార మధ్య నడిపిస్తున్నారు.
ఏ బస్సు ఏ సమయానికి వస్తుందో తెలియక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఉన్న అరకొర బస్సులు కూడా ఇష్టమొచ్చిన రూట్లలో అప్పటికప్పుడు కేటాయిస్తున్నారు. నగర శివార్లకు బస్సులు బంద్ పెట్టి ఉన్న బస్సులను నగరంలో తిప్పుతుండటంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం చర్చలకు దిగిరాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చింది. అన్ని డిపోల ఎదుట రోజుల వారీగా మౌనదీక్షలు, వంటవార్పు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు, కార్మికుల కవాతు తదితర పోరాట కార్యాచరణను ప్రకటించింది. దీంతో మరోసారి తెలంగాణ ఉద్యమ తరహా పోరాటం చేయబోతున్నట్టు ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు.