సిటీబ్యూర్, అక్టోబర్ 1, (నమస్తేతెలంగాణ) : దసరా పండుగకు ఊరెళ్లడానికి నగరవాసులు చుక్కలు చూస్తున్నారు. గురువారం దసరా కావడంతో బుధవారం నుంచి అత్యధిక సంఖ్యలో ఊరుబాట పట్టారు. ఓవైపు సరిపడా లేని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు.
చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నిల్చొనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. నగర శివారు బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఆదిలాబాద్,కరీంనగర్,మెదక్ నిజామాబాద్ వైపు వెళ్లే బస్సులను జేబీఎస్ నుంచి, వరంగల్,హన్మకొండ వైపునకు వెళ్లే బస్సులను ఉప్పల్క్రాస్ రోడ్ నుంచి, సూర్యాపేట,నల్గొండ,విజయవాడ వైపునకు వెళ్లే బస్సులను ఎల్బీనగర్ నుంచి, మహబూబ్నగర్,కర్నూలు,బెంగుళూరుకు వైపునకు వెళ్లే బస్సులను ఆరాంఘర్ నుంచి ప్రత్యేక పాయింట్ల ద్వారా బస్సులు నడుస్తుండటంతో నగరవాసులంతా శివారు బస్టాండ్లకు బారులు తీరారు. బస్సు రావడమే ఆలస్యం రెండు, మూడు నిమిషాల్లో బస్సు కిక్కిరిసిపోతున్నది.
మరలా బస్సు రావడానికి గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. సిటీ బస్సుల్లో వెయ్యి బస్సులను జిల్లాలకు ఆర్టీసీ నడుపుతున్నది. కొన్ని ఆర్డినరీ బస్సులకే ఎక్స్ప్రెస్ బోర్డులు తలిగించి రాకపోకలు చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ఒక్కరికే రూ.వెయ్యి చార్జీ చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. ఒక కుటుంబం ఊరెళ్లాలంటే నాలుగువేల వరకు ఖర్చు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు సరిపడా లేకపోవడంతో చాలా మంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు కార్పూలింగ్ సేవలు కూడా వినియోగించుకుంటున్నారు.