సిటీబ్యూరో, జనవరి 9(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సులలో టిక్కెట్ జారీ చేసే క్రమంలో తలెత్తే చిల్లర సమస్య ఇప్పట్లో తీరే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులలో నిరంతరాయంగా చిల్లర సమస్యల కొనసాగుతూనే ఉంటుంది. బస్సులలో టిక్కెట్ జారీ క్రమంలో తలెత్తే చిల్లర సమస్య బారి నుంచి ఆర్టీసీ కండక్టర్లను, ప్రయాణికులను రక్షించాలన్న ఉద్దేశంతో తెరపైకి తీసుకువచ్చిన యూపీఐ పేమెంట్ (క్యాష్ లెస్ టిక్కెట్) విధానానికి ఆర్టీసీ అధికారులు మంగళం పాడినట్లుగా తెలుస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోవడం, చిల్లర సమస్యలు తీర్చడం కోసం యూపీఐ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. ఆర్టీసీ అధికారులు కూడా అందు కు సంబంధించి దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి ఐటీమ్స్ యంత్రాలనూ కొనుగోలు చేశారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పాటు మహాలక్ష్మీ పథకం అమలు నేపథ్యంలో ఆర్టీసీ బస్సులలో అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌తో పాటు నగరంలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, ఆర్డినరీ బస్సులలో ప్రయాణికులు కిక్కిరిసి పోతున్నారు. దీంతో ఇందులో మహిళా ప్రయాణికులు 40 శాతం నుంచి దాదాపు 65 శాతం వరకు పెరిగారు. అయితే మహిళలకు జీరో టిక్కెట్ జారీ చేయడంతో పాటు ఇతరకు టిక్కె ట్ ఇవ్వడంతోనే కండకర్లు చాలా బిజీగా ఉంటున్నారు.
ఇలాంటి క్రమంలో యూపీఐ విధానం అమలు అనే అంశంపై అధికారులెవ్వరూ దృష్టి సారించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ జోన్‌తో పాటు అన్ని జిల్లాలో పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలయ్యేంత వరకు లేదా ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక ఆంక్ష లు పెట్టేంత వరకు కూడా టిక్కెట్ జారీ కోసం యూపీఐ విధానం అమలు అనే ప్రస్తావన ఉండక పోవచన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం లహరి, ఇంద్ర, రాజధాని, సూపర్ లగ్జరీ వంటి బస్సులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టు వరకు తిరిగే పుష్పక్ ఏసీ బస్సులల్లోనే అంటే పరిమితమైన బస్సుల్లోనే యూపీఐ ద్వారా నగదు రహితా లావాదేవీలు నిర్వహించి, టిక్కెట్ జారీ చేస్తున్నారు. ఆయా బస్సులలో మహాలక్ష్మీ పథకం అమలు కావడం లేదు. అంటే ఆ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించ లేదు. దీంతో ఆ బస్సులు ఎక్కిన మహిళా ప్రయాణికుల నుంచి ముక్కుపిండి టిక్కెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో వాటిలో యూపీఐ విధానం అమలు పరుస్తున్నారు.
యూపీఐ అమల పరుచడం కోసం ఐటిమ్స్ వంటి యంత్రాలు ఉపయోగిస్తున్నారు. ఈ యంత్రాలు వైఫై టెక్నాలజీలతో పని చేస్తుంది. కార్డు పేమెంట్‌తో పాటు యూపీఐ విధానం అందుబాటులో ఉంది. కాని ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉండే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులలో యూపీఐ విధానం ఉండబోదంటూ ఆర్టీసీకి చెందిన సీనియర్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో అధిక ప్రయాణికులు ఉండే బస్సులలో చిల్లర సమస్యలు ఇక నుంచి కూడా యధావిధిగా కొనసాగుతాయని కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.