సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ కోసం నగరం నుంచి జిల్లాల్లో ఉన్న సొంతూళ్లకు వెళ్లి, తిరిగి సొంత ఊర్ల నుంచి నగరానికి చేరుకునే ప్రయాణికులకు ఆర్టీసీ నరకం చూపించింది. పండుగకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందిందన్న అపవాదును ఆర్టీసీ మూటగట్టుకొంది. ఆదాయమే ప్రధాన ఎజెండాగా ఏర్పా టు చేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల అవసరాలను పూర్తిగా గాలికి వదిలేసింది. పండుగ నేపథ్యంలో ఆర్టీసీ గ్రేటర్ జోన్ నుంచి జిల్లాలకు ఏర్పాటు చేసిన దాదాపు 1500 బస్సుల్లో కూడా 25 శాతం వరకు ఆక్యుపెన్సీ అదనంగా పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు ధృవీకరిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి నేపథ్యంలో గత ఐదు రోజుల్లో ఇదే ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ క్రమంలో రోజుకు దాదాపు రూ.5 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. మహాలక్ష్మీ పథకం అమలు, జీరో టిక్కెట్‌తో కలుపుకొని ఈ మేరకు ఆదాయం రాబట్టుకున్న ఆర్టీసీకి కేవలం ఆరు రోజుల్లోనే రూ.30 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు.