సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ ): రాత్రి సమయాల్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి నరకం చూస్తున్నారు. సమయానికి బస్సులు రాక.. గంటల తరబడి బస్టాండ్లు, రోడ్లపైన చీకట్లో నిల్చోని నిరీక్షించాల్సి వస్తోంది. రాత్రి 9 దాటిందంటే బస్సులు ఉండటం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లలో దిగుతారు. వాటి చుట్టుపక్కల ఉన్న సిటీ బస్టాండ్ల నుంచి వారు తమతమ గమ్యాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
అయితే రాత్రి సమయంలో ఈ సిటీ బస్టాండ్ల వద్ద బస్సులు సమయానికి రావడం లేదు. ఎప్పుడొస్తుందో కూడా తెలుసుకునే పరిస్థితులు అక్కడ ఉండటం లేదు. దీంతో బస్సు వస్తుందా రాదా అని తెలియక గంటల తరబడి వేచి చూస్తున్నారు. చివరకు ఆటో, క్యాబ్‌ను ఆశ్రయించి గమ్యాలకు చేరుకుంటున్నారు. అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఆర్టీసీ గ్రేటర్లో బస్సులు నడిపిస్తున్నామని చెబుతున్నా ఆ మేరకు బస్సులు ప్రయాణికులకు అందుబాటులో లేకపోవడం
బాధాకరం.
సరిపడా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో గ్రేటర్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు సంతకాల సేకరణ చేసి ఆర్టీసీ అధికారులకు అందించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీం తీసుకురావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
ముఖ్యంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ల్లో 20 శాతం రద్దీ పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి రీజియన్ పరిధిలోని 8 డిపోల పరిధిలో మహిళా ప్రయాణికుల సంఖ్య మిగిలిన డిపోలతో పోలిస్తే అధికంగా ఉంది. వచ్చే కొన్ని బస్సుల్లో దిల్షుక్నగర్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, కూకట్పల్లి, మియాపూర్, కోఠి, నాంపల్లి, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట్ బస్టాండ్లు మహిళా ప్రయాణికులతో రద్దీని
తలపిస్తున్నాయి.
గ్రేటర్లో జనాభా కోటి మించింది. వారి రాకపోకలకు నగరంలో కనీసం 7 వేల బస్సులు సమకూర్చాల్సిన అవసరం ఉందని ఇప్పటికే రవాణా రంగ నిపుణులు నివేదికలు ఇచ్చారు. ఆర్టీసీ నష్టాల కారణంగా బస్సుల సంఖ్య పెంచలేకపోతున్నామంటూ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో 2800 బస్సులు రాకపోకలు సాగిస్తుండగా ఇందులో ప్రస్తుతం 2600 బస్సులు నడుస్తున్నాయి. 30వేల ట్రిప్పులు కొనసాగుతున్నాయి. ఇవి సరిపోవడం లేదు. మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీం రాకముందు గ్రేటర్లో ఒక్క రోజుకు 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేవారని అధికారులు చెబుతున్నారు. ఉచిత ప్రయాణం వచ్చాక ఒక్క రోజుకు 23లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. దీంతో బస్సుల సంఖ్య పెంచి ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.