సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఎలాంటి అధ్యయనం లేకుండా, నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి.. ప్రజా రవాణా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేశారు. అధికారంలోకి రావడమే పరమావధిగా ఇష్టానుసారంగా ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లడానికి కారణమైందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు పథకం ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా అటు ఆర్టీసీకి.. ఇటు మెట్రోకి తీవ్ర నష్టం మిగిల్చింది. ఓ వైపు ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా కార్మికులు రోడ్డున పడే ముప్పు ఏర్పడగా..ఇంకోవైపు నష్టాలతో మెట్రో తాము నిర్వహించలేమని ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు రెడీ అయింది. ఈ పరిస్థితి అంతా రేవంత్ సర్కార్ తీసుకున్న అతీగతీలేని నిర్ణయాల వల్లేనని విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. మరోవైపు ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 156 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి ఇప్పటివరకు సర్కార్ నుంచి ఎటువంటి సాయం అందించకపోవడం గమనార్హం.
ఏదైన ఒక నిర్ణయం అమలు చేసే ముందర ప్రభుత్వం నిపుణులతో అధ్యయనం చేయించాలి. ఆ రంగానికి చెందిన సీనియర్ ఆఫీసర్లు, మేధావుల సూచనలను తెలుసుకోవాలి. ఉచిత బస్సు పథకం అమలు చేస్తే ఆర్టీసీకి ఎటువంటి నష్టం వాటిల్లుతుందో ప్రణాళికలు రూపొందించి వాటి పరిష్కారాలను సైతం గుర్తించాలి. నష్టాన్ని ఎలా పూడ్చాలో ఆదాయ మార్గాలున్నాయా?లేవా? అనేది ఆరా తీయాలి. ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? ఎన్ని బస్సులు ఉన్నాయి? కార్మికుల కష్టాలు ఏంటి? వారి డిమాండ్లు ఏంటి? ఉచిత బస్సు పథకం వస్తే ఆర్టీసీ నష్టపోతుందా? లేదా? అనేది బేరీజు వేయాల్సి ఉంటుంది. కానీ ఇవేం పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి ఇష్టానుసారంగా అమలు చేసింది. ఏడాదిన్నర అమలు తర్వాత ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదాన్ని తీసుకొచ్చింది.
తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న చందంగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోంది. అప్పటివరకు ప్రయాణికులు ఆర్టీసీ, మెట్రో, ఆటోలను వినియోగించుకుని తమతమ గమ్యస్థానాలకు చేరుకునేవాళ్లు. కానీ ఉచిత బస్సు అమలయ్యాక మిగిలిన రవాణా సదుపాయాలన్నింటినీ వదిలేసి ఉచిత బస్సును వినియోగిస్తున్నారు. సాధారణంగా గ్రేటర్లో ఉచిత బస్సుకు ముందర రోజుకు 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేవాళ్లు. ఇందులో మహిళా ప్రయాణికులు 5 లక్షల మంది ఉండేవాళ్లు. కానీ మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు రోజుకు సుమారు 24 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 17 లక్షల మంది మహిళలే ఉండటం విశేషం. ఒక్క రోజుకు ఇంతమంది ప్రయాణం కేవలం గ్రేటర్లో ఉన్న 2800 బస్సులపైనే ఆధారపడి ఉంది. రోజుకు 30వేల ట్రిప్పులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. దీంతో ప్రతీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. కోట్లాది రూపాయల భారం ఆర్టీసీపై పడుతున్నది. మరి వీరి ఉచిత బస్సు ప్రయాణానికి సర్కార్ ఆర్టీసీకి ఇవ్వాల్సిన ఆదాయాన్ని కూడా సమకూర్చడం లేదు. ఫలితంగా ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది. అటు మెట్రోలో సైతం మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గింది.ఫలితంగా ఉచిత బస్సు ప్రభావం మెట్రోపై పడిందని ఏకంగా మెట్రో అధికారులే వాపోయారు.
ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. గిరాకీ లేక ఇంటి అద్దె, ఈఎంఐ, పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసరాలు సమకూర్చుకోలేక కన్నీటిపర్యంమవుతున్నారు. ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లు ఉపాధి ఉండదని ఏడాదికి రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ మి ఇచ్చినా.. ఇప్పటికీ అది అమలు కాలేదు. ఆటో డ్రైవర్లంతా జేఏసీగా ఏర్పడి ధర్నాలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఆర్థిక సమస్యలతో ఇప్పటివరకు 156 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరి కుటుంబాలకు సర్కార్ ఇప్పటివరకు ఎలాంటి చేయూతనివ్వలేదని ఆటో సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది డ్రైవర్లు చౌరస్తాల్లో భిక్షాటన సైతం చేశారు. దసరా పండుగ ప్రయాణానికి గిరాకీలేక ఆటోలు మూగబోయాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉచిత బస్సుతో గిరాకీలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆటో ఈఎంఐలు, ఇంటి ఖర్చులు భారం అవుతున్నది. మహిళలందరూ ఉచిత బస్సు వినియోగించుకుంటున్నారు. ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లతో పాటు ఆర్టీసీ, మెట్రో కూడా నష్టపోతున్నది. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందంటున్నారు. మెట్రో సైతం తాము నిర్వహించలేమని చెబుతున్నారు.ఇదంతా రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్లే జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ధి గాడి తప్పింది.
– జే. పరశురాం, ఆటో డ్రైవర్, మల్కాజిగిరి
సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఆర్థికసాయం ప్రకటించకుండానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఉపాధి లేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి కుటుంబాలను ఎవరు ఆదుకోవాలి. ఉచిత బస్సు ప్రయాణం ప్రజా రవాణా వ్యవస్థనే ప్రశ్నార్ధకంగా మార్చింది. దీనంతటికీ సీఎం రేవంత్ రెడ్డి తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
– పెంటయ్య గౌడ్, ఆటో డ్రైవర్