సిటీబ్యూరో: కాలం చెల్లిన వాహనాలపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 15 ఏండ్లు నిండిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాపింగ్ చేసుకుంటే పలు రాయితీలు పొందవచ్చనని అధికారులు ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే మహానగరంలో కాలం చెల్లిన వాహనాలు వేలాదిగా ఉన్నాయి. ఇవన్నీ రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి.
అధికారులు తనిఖీల్లో కొన్ని పట్టుబడుతున్నా.. చాలా వరకు ముఖ్యంగా స్కూల్ బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాలు గడువు ముగిసినా తిరుగుతున్నాయి. అధికారులు వీటిపై దృష్టి సారించి ప్రత్యేక తనిఖీలు సైతం చేస్తున్నారు. అందులో భాగంగా వాహనదారులకు స్క్రాపింగ్ ఉపయోగాలను వివరిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలైతే 20 ఏండ్ల లోపు స్క్రాప్ చేస్తే.. ప్రతి ఏటా పన్నుపై 10 శాతం రాయితీ వస్తుంది. సొంత వెహికల్ 15 ఏండ్లు నిండిన తర్వాత స్వచ్ఛందంగా స్క్రాపింగ్ వస్తే సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ వస్తుంది. రెండేండ్లలోపు అదే విలువ గల వాహనం కొంటే ఎంవీ ట్యాక్స్‌లో మినహాయింపు ఉంటుంది. ఈ అంశాలపై అధికారులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.