సిటీబ్యూరో: విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లు జరభద్రం. ఇటీవల పోలీసులు, రవాణా శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో కొందరు డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పట్టుబడగా.. ఇంకొందరు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను రోడ్డెక్కించారు. మద్యం మత్తులో ప్రమాదకర డ్రైవింగ్ చేసిన 17 మంది విద్యా సంస్థల బస్సుల డ్రైవర్ల లైసెన్స్ సస్పెండ్ చేయాలని ఆర్టీఏ అధికారులకు పోలీసుల నుంచి సిఫారసులు వచ్చాయి. రవాణా శాఖ అధికారులు వీరి లైసెన్స్ సస్పెన్షన్ ప్రక్రియలో భాగంగా వారికి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.
హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో విద్యా సంస్థల బస్సు డ్రైవర్లు నిర్లక్షంగా డ్రైవింగ్ చేస్తూ మద్యం మత్తులో పోలీసులకు పట్టుబడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వారిని కట్టడి చేయడంలో భాగంగా వారి లైసెన్స్‌లను రద్దు చేయనున్నారు. గత రెండేండ్లలో 1415 మంది విద్యాసంస్థల బస్సులు, స్కూల్ ఆటో డ్రైవర్ల లైసెన్స్‌లు సస్పెండ్ అయ్యాయి. ఈ క్రమంలో ఆర్టీఏ అధికారులు విద్యా సంస్థలకు ప్రత్యేక సూచనలు చేశారు.