సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ) : వాళ్లు ఆర్టీఏ కానిస్టేబుళ్లు. కార్యాలయాల్లో తమకు కేటాయించిన విభాగాల్లో వారు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వాహనదారులను క్రమపద్ధతిలో సేవలు ఉపయోగించుకునేలా చూసే బాధ్యత వారిదే. తమకు ఆ రోజు కేటాయించిన విభాగంలో వచ్చే దరఖాస్తులను పరిశీలించి లోపలికి అనుమతించాలి. అయితే వీళ్లు ఆ పనులను మానేసి గ్రేటర్‌లోని ఆర్టీఏ కార్యాలయాల్లో కొందరు కానిస్టేబుళ్లు ఏజెంట్ల అవతారమెత్తారు. ఇటీవల ఏసీబీ దాడులు జరిగిన దృష్ట్యా కార్యాలయాల్లోకి దళారులను అనుమతించడం లేదు. వారిని రావొద్దంటూ ఆర్టీఓ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అయితే వీరి బాధ్యతను కొందరు కానిస్టేబుళ్లు భుజానకెత్తుకున్నారు. దళారులు మోసుకొచ్చే దరఖాస్తులను ఈ కానిస్టేబుళ్లు తీసుకొని ఆ పనులను చక్కబెడుతున్నారు. కొందరు సిబ్బంది కార్యాలయాల్లోనే కొన్ని గదులను అడ్డాగా చేసుకుని దందా చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై రవాణా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఏసీబీ దాడులతో ఆర్టీఏ కార్యాలయాల్లోకి దళారుల ప్రవేశం బంద్ అయింది.
వారు రోజు చేసే దరఖాస్తుల దందాకు మాత్రం చెక్ పడలేదు. దీంతో కొందరు అధికారుల ప్రోద్బలంతో దళారులు తీసుకొచ్చే బిజినెస్‌ను ఇప్పుడు కానిస్టేబుళ్లు తీసుకొస్తున్నారు. అలా బిజినెస్ తీసుకొచ్చే కానిస్టేబుళ్లకు కార్యాలయంలో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. కార్యాలయంలోకి ఎవరూ రావాలి? ఎవరూ రాకూడదు? అనేది ఆ కానిస్టేబుళ్లే నిర్ణయిస్తారు. ప్రధాన గేటు వద్ద ఉండి వారికి బిజినెస్ తీసుకొచ్చే వారిని లోపలికి పంపించి.. ఏదైనా సేవల వివరాలు తెలుసుకోవాలనుకునే వారిని మాత్రం అనుమతించరు. గేట్ల వద్ద ఐదు, అరుగురు సిబ్బంది ఉండి హడావిడి చేస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. వారికి అవసరమైన వారు కనిపించగానే వాళ్ల వద్ద ఎలాంటి స్లాట్ లేకున్నా లోపలికి అనుమతించేస్తున్నారు. అలా లోపలికి వెళ్లిన దళారులు వారి ఫైళ్లను కానిస్టేబుళ్లకు అందించి నిమిషాల వ్యవధిలోనే అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.
మణికొండ, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్, బండ్లగూడ తదితర కార్యాలయాల్లో ఆర్టీఏ కానిస్టేబుళ్ల దందా దళారులకు మించి సాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఫైళ్లపై కోడ్‌గా కలర్ పేపర్స్ అంటించడం, కోడ్ లాంగ్వేజ్ గీయడం, కొస పేపర్ చించడం ఒకప్పుడు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మార్చారు. ఏసీబీ ఎఫెక్ట్‌తో ఎటువంటి కోడ్ లాంగ్వేజీని దరఖాస్తులపై చూపడం లేదు. కేవలం కనుచూపుతోనే ఆ ఫైళ్లు తమవేననే సంకేతాలు అధికారులకు ఇస్తున్నారు.
ఓవైపు కౌంటర్ల వద్ద వాహనదారులు తమ పనుల కోసం క్యూలైన్లో గంటల తరబడి ఎదురుచూస్తున్నా.. వారి పనులు పక్కన పెట్టేసి కానిస్టేబుళ్లు తీసుకొచ్చే దరఖాస్తులను సంబంధిత విభాగాల సిబ్బంది పూర్తి చేస్తున్నారు. ఉప్పల్‌లో ఓ వాహనదారుడు లెర్నింగ్ లైసెన్స్ పరీక్ష రాస్తుండగా.. ఆ పరీక్షను అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ అన్నింటి సమాధానాలు క్లిక్ చేస్తూ పరీక్ష ముగించి లెర్నింగ్ లైసెన్స్ చేతులో పెట్టి పంపిచేశాడు. మణికొండ కార్యాలయంలో వాహనాల ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, వాహన బదిలీ, చనిపోయిన వారి పేరు మీదు ఉన్న వాహనాలను కుటుంబ సభ్యుల మీదకు మార్చడానికి ఇలా తీరొక్క పనుల్లో ఏదో ఒక కొర్రీ పెట్టి అడిగినంత దండుకుంటున్నారు.
రవాణా శాఖ కార్యాలయాల్లో ఏఐ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులు గతంలో తెలిపారు. కానీ ఖైరతాబాద్‌లో మాత్రమే ఏఐ కెమెరాల ఏర్పాటు జరిగింది. ఏఐ కెమెరాలు లేని కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఉండాలి. కానీ అవి అన్ని కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఉన్నప్పటికీ చాలా వరకు అవి పనిచేయడం లేదు. సిబ్బంది పనిచేసే చోట సీసీ కెమెరాలు పటిష్టంగా పనిచేస్తే అవినీతికి చెక్ పెట్టొచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు.
కొన్ని కార్యాలయాల్లో పనులు వేగంగా చేయాల్సి ఉన్నప్పటికీ కావాలనే సిబ్బంది ఆలస్యం చేస్తున్నారు. దీంతో క్యూలైన్లో నిల్చొని ఉంటున్న వాహనదారులు అలసట చెంది అక్కడే ఉన్న కానిస్టేబుళ్లను సంప్రదించి పని చేసి పెడతావా అని అడిగే పరిస్థితులు సృష్టించడం విశేషం. క్యూలైన్లను పర్యవేక్షించి పనులు అందుతున్నాయా లేదా అని చూడాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా ఉండటంతో కిందిస్థాయి సిబ్బంది ఆడిందే ఆటగా మారిందని వాహనదారులు చెబుతున్నారు.