Congress | ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టు కాంగ్రెస్ నాయకుల తీరు ఉంది. ప్రజా ప్రయోజనాలకు కేటాయించాల్సిన నిధులను గోల్మాల్ చేసి.. జేబులు నింపుకోవడానికి రెడీ అయ్యారు. అందులో భాగంగా ఉచిత సేవను కూడా వదలలేదు. గతంలో నిరుద్యోగులకు మూడు నెలలు ఉచితంగా కోచింగ్ ఇచ్చిన ఓ ఇనిస్టిట్యూట్ పేరుతో ఏకంగా రూ.86.64 లక్షలను కాజేసేందుకు పథకం రచించారు. దీనికి బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ ఈ నెల 16న జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం కూడా చేసింది.
ఇప్పుడు ఈ తీర్మానం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. గుట్టుగా ఈ నిధులను నొక్కెయ్యాలని చూసిన కాంగ్రెస్ నాయకుల వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ బట్టబయలు చేసింది. కేసీఆర్ సర్కార్‌లో నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి ఆనాటి ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ముందుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను సైతం వారే భరించారు. ఈ హామీతో బడంగ్‌పేటలో ‘శ్రీ గణేశ్ బిగ్ టైమ్స్’ అకాడమీ ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్టు ముందుకొచ్చింది.
ఈ మేరకు పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. అందులో భాగంగా జిల్లా గ్రంథాలయ కేంద్రంలో మూడు నెలలు ఉచితంగా కోచింగ్ కూడా అందించింది. ఇక్కడి వరకు బాగానే ఉంది.. అదే ఉచిత కోచింగ్ సేవకు ఇప్పుడు బడంగ్‌పేట కాంగ్రెస్ నాయకులు రూ. 86 లక్షలు వెలకట్టి నిధులను దారి తప్పించడానికి పూనుకోవడం విశేషం.
– బడంగ్‌పేట, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)
శ్రీ గణేశ్ బిగ్ టైమ్స్ అకాడమీ ఫౌండర్ శివ శంకర్‌కు కూడా తెలియకుండానే రూ.86.64 లక్షలు నొక్కేందుకు కౌన్సిల్ తీర్మానం చేయడం విశేషం. ఆ మూడు నెలల ఉచిత కోచింగ్‌కు 40 నుంచి 50 మంది నిరుద్యోగులు హాజరైనట్టు జిల్లా గ్రంథాలయంలో నమోదైంది. వీరి కోసం నలుగురు ఫ్యాకల్టీలు పనిచేశారు. ఇందుకు వారికి నెలకు రూ.15 నుంచి 20వేలు అనుకున్నా.. రూ. 2లక్షలు దాటదు. గతంలో 200 కుర్చీలను సైతం అకాడమీకి ఇచ్చినట్టు రికార్డులు ఉన్నాయి. మిగిలిన ఖర్చులు ఏమైనా ఉంటే మరో రూ.3 లక్షలు వేసుకున్నా.. రూ. 6 లక్షలకు మించదు. ఈ ఉచిత కోచింగ్ ఆరు నెలలు అనుకున్నా.. రూ.12 లక్షలకు మించదు. ఈ ఖర్చులకు సైతం అప్పట్లో ప్రజా ప్రతినిధులే సాయం అందించినట్టు కొంతమంది కార్పొరేటర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఉచిత కోచింగ్‌ను బూచిగా చూపి శ్రీ గణేశ్ అకాడమీకి బడంగ్‌పేట కార్పొరేషన్ నిధులను కేటాయించడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి.
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ నెల 16న నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో.. “జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగ పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ప్యాకేజీ పద్ధతి ద్వారా గౌరవ మేయర్ గారి ముందస్తు అనుమతితో నియమించుకున్న అనుభవజ్ఞులైన శ్రీగణేశ్ బిగ్ టైమ్స్ అకాడమీకి బిల్లు మొత్తం రూ.86,84,800 చెల్లించుటకు, గౌరవ మేయర్ గారు తీసుకున్న ముందస్తు అనుమతిని ధ్రువీకరించుటకు గాను గౌరవ కౌన్సిల్ వారి ముందు ఆమోద నిమిత్తం సమర్పించడమైనది..” అని ఎజెండాలోని 18వ అంశంలో పొందుపర్చారు.
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. కౌన్సిల్ సమావేశంలో శ్రీగణేశ్ బిగ్ టైమ్స్ అకాడమీకి లక్షల్లో నిధులు కేటాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాను. కౌన్సిల్ సభ్యులు ఎవరూ పట్టించు కోవడంలేదు. రెండేండ్ల కిందట ప్రభుత్వం ఉచిత కోచింగ్ ఇస్తే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎందుకు నిధులు కేటాయించాలని తాను వాదించాను. ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. మూడు నెలల కోచింగ్‌కు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కేటాయించడం ఎంత వరకు సమంజసం. ముమ్మాటికి ఇది నిధుల దుర్వినియోగమే. కౌన్సిల్లో ప్రస్తావన చేస్తే ఏదో కాకిలెక్కలు చెబుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.
శ్రీగణేశ్ బిగ్ టైమ్స్ అకాడమీకి నిధులు కేటాయిస్తున్నట్లు తనకు ఎవరూ సమాచారమివ్వలేదు. గతంలో కోచింగ్‌కు అయిన నిధులు కేటాయించాలని కోరడం జరిగింది. గతంలో ఉన్న కమిషనర్లు ఎవరూ పట్టించు కోలేదు. ఉచిత కోచింగ్ ఇచ్చావు కదా.. మరి డబ్బులు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికీ ముగ్గురు కమిషనర్లు మారారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఎంత ఇస్తారో కూడా తెలియదు. ప్రాసేస్ చేస్తామన్నారు.