గ్రేటర్లో సుమారు 5 లక్షలకు పైగా వీధి దీపాలను నిర్వహించే బాధ్యతలను 2018 నుంచి ఏడేండ్ల పాటు ఈఈఎస్ఎల్కు అప్పగించారు. 10 శాతం దీపాలు టైమర్ల సహాయంతో ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతున్నాయి. మిగిలిన వాటిని మ్యానువల్‌గానే నిర్వహిస్తున్నారు. అయితే వీధి దీపాల నిర్వహణలో సదరు ఏజెన్సీ నిర్లక్ష్యం కారణంగా చాలా ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదు.
Street Lights | సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : వెలగని వీధి దీపాలతో భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో చీకట్లు అలముకున్నాయి. ఐదు లక్షలకు పైగా ఉన్న వీధి దీపాల్లో దాదాపు 35 శాతానికి పైగా పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో తరచూ స్ట్రీట్ లైట్లు వెలుగక ఇబ్బందులు పడుతున్నామంటూ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి.
దీనిపై దృష్టి సారించిన కమిషనర్ ఆమ్రపాలి సదరు నిర్వహణ బాధ్యతలు చూసే ఈఈఎస్ఎల్ ఏజెన్సీ ఏ మాత్రం పనితీరు మెరుగుపర్చుకోవడం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఏజెన్సీ పనితీరులో మార్పు రాకపోవడంతో ఏకంగా రూ. 80కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులను కమిషనర్ నిలిపివేశారు. దీంతో పాటు కొత్తగా ఏర్పాటైన పది కాలనీల్లో వీధి దీపాలను ఏర్పాటు చేసే బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించి, ఈ మేరకు టెండర్లు పిలిచారు.
గ్రేటర్లో సుమారు 5 లక్షలకు పైగా వీధి దీపాలను నిర్వహించే బాధ్యతలను 2018 ఏప్రిల్ నుంచి ఏడేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)కు అప్పగించిన సంగతి తెలిసిందే. వీటిలో పది శాతం స్ట్రీట్ లైట్లు టైమర్ల సహాయంతో ఆటోమెటిక్‌గా వెలగడం, ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతుండగా, మిగిలిన వాటిని మ్యానువల్‌గానే మెయింటెన్ చేస్తున్నారు. అయితే నిర్వహణలో ఈఈఎస్ఎల్పై తరచూ కార్పొరేటర్లు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.
ఒకానొక దశలో గత కమిషనర్లు సైతం మందలించారు. ముఖ్యంగా వీధి దీపాల మరమ్మతుల పాలైనప్పుడు మార్చాల్సిన లైటు, ఇతర పరికరాలను సుమారు 15 శాతం రిజర్వ్ పెట్టుకోవాలన్న నిబంధన ఒప్పందంలో ఉన్నప్పటికీ దానిని ఈఈఎస్ఎల్ ఏ మాత్రం అమలు చేయడం లేదు. పైగా కొత్తగా పది కాలనీలకు విద్యుత్ సరఫరా మంజూరయినప్పటికీ స్తంభాలు వేసి, కరెంట్ తీగలను లాగడంతో పాటు వీధి దీపాలను బిగించాల్సిన ఈఈఎస్ఎల్ పట్టించుకోవడం లేదు.