రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రగల్భాలు పలుకుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతోనే రాష్ట్ర ఖజానాను అప్పుల ఊబిలోకి సన్నద్ధమైంది. సొంత నిధులు కేటాయించే సత్తా లేక, అంతా అప్పుల మయం చేస్తూ జీవోలు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తొలి దశ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. 7345.12 కోట్లకు పరిపాలన అనుమతులను రేవంత్ సర్కార్ మంజూరు చేసింది. ఇందులో అత్యధిక భాగం రుణాల రూపంలోనే సేకరించాలని నిర్ణయించడం గమనార్హం. స్వయం సమృద్ధి, బడ్జెట్ కేటాయింపులు లేకుండా కేవలం అప్పుల భారాన్ని ప్రజలపై మోపుతూ ఈ ప్రాజెక్టును ముందుకు నెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రూ. 4500 కోట్ల భారీ రుణాన్ని ఆశిస్తూ కాంగ్రెస్ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ఏడీబీ రుణాలకు సంబంధించిన సంప్రదింపులు ఏడాదిన్నర కాలంగా సాగుతున్నది. అయితే లోన్ల ప్రక్రియ ప్రాథమిక దశలోనే ఉండటం, తుది ఆమోదం రాక ముందే, ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ ఏడీబీ షరతులు కఠినంగా ఉంటే, ఈ ప్రాజెక్టు భవిష్యత్ ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
రెండు కారిడార్లలో ప్రాజెక్టు..
ఈ ప్రాజెక్టును రెండు ప్రాధాన్యత కారిడార్లలో (జోన్-1ఏ నుంచి జోన్-1బీ) చేపట్టనున్నారు. హిమయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20కి.మీ(రూ.3232.10 కోట్లు), ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80కి.మీ(రూ.4113.11 కోట్లు) చొప్పున మొత్తం 21 కి.మీ మేర పనులు నిర్వహించనున్నారు. ఇంత భారీ వ్యయంతో కూడిన పనులను ఈపీసీ(ఇంజినీరింగ్ ప్రొక్యూర్, కన్స్ట్రక్షన్) విధానంలో చేపట్టాలని, వీటికి తోడు ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ)నీ నియమించాలని నిర్ణయించారు.
ఈ పీఎంసీల పేరిట కూడా భారీగా ప్రజాధనం దుర్వినియోగం చేసేలా సర్కారు ప్రణాళికలు రూపొందించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తొలి దశలో గ్రాంట్లతో నెట్టుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. లోపల ఏం జరుగుతున్నదనేది తెలియాల్సి ఉంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్‌గా పేర్కొన్న రూ. 2845.12 కోట్లను కూడా హెచ్ఎండీఏ లేదా టీజీఐఐసీలపై మోపిన సర్కార్.. ఈ రెండు ప్రభుత్వ సంస్థల ద్వారా అదనంగా రుణాలు సేకరించి ఈ మొత్తాన్ని సమకూర్చాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే, ఈ రూ. 7345 కోట్ల ప్రాజెక్టులో నూటికి నూరు శాతం అప్పులే తప్ప.. ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని స్పష్టమవుతున్నది.
భూసేకరణ లెక్క వేరు..
రెండు జోన్ల పరిధిలో 21కి.మీ మేర జరిగే మూసీ అభివృద్ధిలో ఇప్పటివరకు సర్కార్ చెప్పిన లెక్కలన్నీ కూడా కేవలం నిర్మాణం కోసమే. ఇందులో హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు సేకరించే ఆస్తుల వివరాలు, వాటి భూసేకరణ వ్యయం, ప్రైవేట్ కన్సల్టెన్సీలకు లాభం చేకూర్చేందుకు ఈ విధంగా అడ్డగోలుగా అంచనాలు పెంచేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొలిక్కి రాని ఏడీబీ లోన్లు..
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రూ.4,500 కోట్ల భారీ రుణంపై ఆశలు పెట్టుకున్న సర్కార్.. దీనికోసం ఏడాదిన్నర కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఇటీవలే ఏడీబీ ప్రతినిధులను కూడామూసీ పరీవాహక ప్రాంతంలో తిప్పి, ప్రభుత్వం చేయబోయే ప్రాజెక్టును వివరించింది. కానీ బ్యాంకు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. కేవలం సానుకూలత వ్యక్తం చేసినా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయవనరులను బట్టి బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయని, ఇందులో నిబంధనలు, జరిగే పర్యావరణ వ్యవహారాలను కూడా పరిగణనలోకి తీసుకునే రుణాలను మంజూరు చేస్తుందనే బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఏడీబీ రుణాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉండటం, తుది ఆమోదం లభించకపోవడం గమనార్హం. మొదటి విడత ఖర్చుల లెక్కను గమనిస్తే.. భూసేకరణ వ్యయం మినహా మొత్తం కేటాయింపు (జోన్-1ఏ,జోన్-1బీ) కోసం రూ.7345.12 కోట్లు కాగా ఇందులో 70శాతానికిపైగా ఏడీబీ నుంచి రుణాలను సర్కార్ ఆశిస్తున్నది.

Dd