హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను ఈ నెల 31లోగా పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) సర్కార్‌కు అల్టిమేటం జారీచేసింది. గడువులోపు సమస్యలు పరిష్కరించకపోతే వేల మంది టీచర్లతో సచివాలయం, అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించింది. సమస్యలు పరిష్కారించాలన్న ప్రధాన డిమాండ్‌తో తపస్ శనివారం ‘చలో హైదరాబాద్’ నిర్వహించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య మాట్లాడుతూ.. తాము కొత్తగా ఏమీ కోరడంలేదని, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు.. న్యాయంగా ఇవ్వాల్సిన డీఏలు, పీఆర్సీలనే కోరుతున్నామని పేర్కొన్నారు. ధర్నాకు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మండలి పక్షనేత డాక్టర్ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య తదితరులు మద్దతు పలికారు.