నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ఫేం అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘క్రేజీ కల్యాణం’. భద్రప్ప గాజుల దర్శకుడు. బూసం జగన్మోహన్రెడ్డి నిర్మాత. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకురాలు నందినీరెడ్డి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎంత స్థానికత ఉంటే అంత గొప్ప సినిమా అవుతుందని నా నమ్మకం. ఇది తెలంగాణ నేపథ్య చిత్రమైనా అన్ని ప్రాంతాలకూ నచ్చుతుంది. ఈ సినిమాను చూస్తుంటే జీవితాన్ని చూస్తున్నట్టుంది’ అని ప్రజాకవి గోరేటి వెంకన్న అన్నారు. ‘మనిషి తనను తాను గుర్తించడం.. సమాజం చేత గుర్తింపబడటం.. ఈ రెండింటిలో ఏది అవసరం? అనే తాత్విక సంఘర్షణే ఈ సినిమా కథ’ అని దర్శక, నిర్మాత వేణు ఊడుగుల పేర్కొన్నారు.
‘ఈ కథ వింటూ నవ్వీ నవ్వీ కడుపు నొప్పి వచ్చింది. ‘నువ్వు చెప్పింది చెప్పినట్టు తీస్తే సినిమా హిట్’ అని దర్శకుడు భద్రప్ప చెప్పాను. షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ కూడా పూర్తి చేశాను. ఈ సినిమాతో ఓ మంచి దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు’ అని అనుపమ పరమేశ్వరన్ నమ్మకంగా చెప్పింది. నిజజీవితంలో చూసే పాత్రలే ఇందులో కనిపిస్తాయని దర్శకుడు భద్రప్ప గాజుల తెలిపారు.