సిటీబ్యూరో, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): ఫైవ్ పైసాలో ట్రేడింగ్ చేసి భారీ లాభాలు సంపాదించవచ్చంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు రూ.63లక్షలు టోకరా వేశారు. జూలై నెలలో బాధితుడికి ఆరోహి సిహ్న అనే పేరుతో ఓ మహిళ ఫోన్ చేసి ఫైవ్ పైసా కంపెనీ నుంచి మాట్లాడుతున్నానని, తమ సంస్థ ట్రేడింగ్ బ్రోకరేజ్ చేస్తుందని, ట్రేడింగ్‌లు మెలుకువలు చెబుతూ మీకు ఎప్పటికప్పుడు సహాయ పడుతూ మంచి లాభాలు వచ్చేలా చేస్తామంటూ మాట్లాడింది.
ఆ తరువాత బాధితుడి ఫోన్ నంబర్‌ను డీ55 పైసా క్యాపిటల్ లిమిటెడ్ పేరుతో ఉన్న వాట్సాఫ్ గ్రూప్‌లో యాడ్ చేసింది. అందులో ఉన్న సభ్యులు 5పైసా ట్రేడింగ్‌లో తాము షేర్స్ ట్రేడింగ్ చేస్తున్నామని, మంచి లాభాలొస్తున్నాయంటూ మాట్లాడుకున్నారు. వాళ్ల మాటలు చూసి బాధితుడు కూడా నిజమని నమ్మాడు. జూలై 12వ తేదీన ఆరోహి సిహ్న తిరిగి ఫోన్ చేసి 5 పైసాలో మీకు ప్రిమియం బ్రోకర్ అకౌంట్ తెరుస్తున్నామంటూ సూచించింది.
ఈ మేరకు మెయిన్.5పైసాప్రో.కామ్ వెబ్సైట్లో బాధితుడికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను అందించి ఒక ఖాతాను ఓపెన్ చేశారు. అందులో మొదట రెండు దఫాలుగా లక్ష రూపాయల పెట్టుబడి పెట్టడంతో సుమారు రూ.4వేల లాభం రెండు రోజుల్లోనే వచ్చింది. దీంతో నమ్మకం పెరగడంతో రూ.10లక్షల వరకు పెట్టుబడి పెట్టడంతో రూ.2.99 లక్షలు లాభం చూపించారు. వారం రోజుల వ్యవధిలోనే తాను పెట్టిన పెట్టుబడి రూ.32లక్షలకు చేరింది.
అందులో లాభం కూడా ఉండటంతో అంతా బాగానే ఉందనే భావనలో బాధితుడున్నాడు. ఆ తరువాత ఐపీఓ స్టాక్స్ తీసుకోవాలంటూ మీకు సిస్టమ్ ద్వారా 6500 షేర్స్ అలాట్ అయ్యాయని, వాటి విలువ రూ.71.50 లక్షలంటూ సూచించారు. రూ.39 లక్షలు చెల్లిస్తే మీకు షేర్స్ సొంతం అవుతాయంటూ నమ్మించడంతో బాధితుడు ఆ డబ్బును చెల్లించాడు. మరో వారం రోజుల్లోనే మరికొంత మొత్తం పెట్టుబడి పెట్టాడు. ఇలా 5పైసా ఖాతాలో రూ.1.87కోట్ల విలువైన ఫండ్స్ చూపిస్తుండగా.. అందులో రూ.1.23 లాభాలు వచ్చినట్లు స్క్రీన్‌ఫై కన్పిస్తోంది.
తన ఖాతాలో ఉన్న లాభాలను విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా.. అది వీలు కాలేదు. దీంతో తిరిగి ఆరోహి సిహ్నకు ఫోన్ చేయడంతో లాభాలపై 20 శాతం కమీషన్ చెల్లించాలని, ఆ తరువాతే మీరు విత్‌డ్రా చేసుకోగలరంటూ సూచించడంతో తన లాభాలలో 20 శాతం మినహాయించి మిగతాది ఇవ్వాలని కోరారు. అలా కుదరదని మీరు 20శాతం కమీషన్ చెల్లిస్తేనే అందులో నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుందంటూ కచ్చితంగా చెప్పారు. దీంతో 5ఫైసా ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకుడు గౌరవ్ సేత్‌కు ఫోన్ చేశాడు. తప్పనిసరిగా 20 శాతం చెల్లించాలంటూ సూచించాడు.
దీనిపై అనుమానం వచ్చిన బాధితుడు సెబీ(స్టాక్ ఎక్సేంజ్ బోర్డుకు) దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. దీంతో మీరు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి షేర్స్ కొనలేదని, అదంతా మోసమని, మీరు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండంటూ సూచించారు. దీంతో బాధితుడు తాను రూ.63.90లక్షలు పెట్టుబడి పెట్టానని, రూ.21,696 లాభంగా తిరిగి ఇచ్చారని, రూ.63.86 లక్షలు ట్రేడింగ్ పేరుతో మోసం చేశారంటూ రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.