సిటీబ్యూరో, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, డబ్బులు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి పెట్టి తీరా డబ్బులు విత్ డ్రా చేసే సమయంలో అవి రాకుండా చేసి నగరవాసి నుంచి రూ.28 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. యూసుఫ్‌గూడకు చెందిన 40ఏళ్ల వ్యక్తిని ఫేస్బుక్ ద్వారా నేరగాళ్లు సంప్రదించారు. ఆ తర్వాత 200మంది సభ్యులున్న ఎఫ్ 55 -ఫార్చ్యూన్ స్కైప్ అనే వాట్సప్గ్రూపులో యాడ్ చేశారు.
ఈ గ్రూపులో ట్రేడింగ్, ఐపీఓలలో పెట్టుబడులు పెడితే అధికలాభాలు వస్తాయంటూ జరిగిన చర్చలు, అక్కడి పరిస్థితులను చూసి నమ్మిన బాధితుడు సెబి రిజిస్టర్ చేసిన అకౌంట్లలోకి డబ్బులు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత నేరగాళ్లు అతనికి లాభాలు వచ్చినట్లు చూపించి బ్రోకరేజ్ ఫీజు కింద రూ.3.11లక్షలు చెల్లించితేనే డబ్బులు డ్రా చేసుకోవచ్చని చెప్పారు. తమకు సంబంధించి ఫేక్ ట్రేడింగ్ యాప్ ఆర్సీఎల్-పీఎంఏలో రూ.42లక్షలు బ్యాలెన్స్‌గా చూపించి డబ్బులు విత్ డ్రా చేసుకోవాలని, లేకుంటే అవి చారిటీకి ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పారు.
ఈ వాట్సప్ గ్రూప్ మోసగాళ్ల చేతిలో రన్ అవుతుండగా చాలామంది ఇన్వెస్టర్లు బాధితులుగా ఉన్నారని బాధితుడు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో బాధితుడు రూ.28,76,715లు కోల్పోయినట్లు సైబర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. సెబి రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ అవి సెబి అఫీషియల్ సైట్లో ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలని, సోషల్ మీడియా వేదికలపై వచ్చే పెట్టుబడుల మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని సైబర్‌క్రైమ్ పోలీసులు సూచించారు.