సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): హవాలా మార్గంలో డబ్బును తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 34.5 లక్షల నగదును సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ నిఖితా పంత్ కథనం ప్రకారం.. శివరాంపల్లిలో నివాసముండే శివష్ణురాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతడి వద్ద డ్రైవర్‌గా మహ్మద్ మన్సూర్ పనిచేస్తున్నాడు. ఇతడికి నల్లగుట్టకు చెందిన భవేశ్ కుమార్‌తో హవాలా సంబంధాలు ఉన్నాయి. పన్ను ఎగ్గొడుతూ అక్రమ పద్ధతిలో నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం శివష్ణురాయ్, భవేశ్ కుమార్ భారీగా నగదును పలువురి వద్ద నుంచి సేకరించారు. ఆ నగదును జీపులో దాచి, కిమ్స్ దవాఖాన వద్ద ఇతరులకు అప్పగించాలని శివష్ణురాయ్ తన డ్రైవర్‌కు సూచించాడు. నల్లగుట్టలో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా.. జీపులో రూ. 34.50 లక్షలు పట్టుబడ్డాయి. డ్రైవర్‌ను విచారించడంతో ఆదేశాలిచ్చిన వారి పేర్లు చెప్పాడు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని, తదుపరి విచారణ నిమిత్తం రాంగోపాల్‌పేట పోలీసులకు అప్పగించారు.
జగద్గిరిగుట్టలో..
జగద్గిరిగుట్ట: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదును జగద్గిరిగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్బెస్టాస్కాలనీలో సోమవారం జగద్గిరిగుట్ట పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. రూ.1.48 లక్షలు పట్టుబడ్డాయి. నగదుకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
దుండిగల్‌లో..
దుండిగల్: దుండిగల్ పోలీసులు గండిమైసమ్మ చౌరస్తాలో సోమవారం మేడ్చల్ ఎస్ఓటీ బృందంతో కలిసి తనిఖీలు నిర్వహించారు. అరవింద్ సింగ్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై రూ.17.4లక్షలు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్టు ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు.
కొండాపూర్ : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గంగారం ప్రధాన రహదారిలో చేపట్టిన వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 99 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో ఈ డబ్బును ఆధాయపన్ను శాఖ అధికారులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.