Jalamandali | బంజారాహిల్స్, డిసెంబర్ 19: నగరం నడి బొడ్డున జల మండలికి కేటాయించిన సుమారు రూ.200 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు గురయింది. షేక్‌పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.10లోని తట్టిఖానా జల మండలి రిజర్వాయర్ పక్కన సర్వే నం.403లోకి వచ్చే టీఎస్ 1/ పీ, 4/పీ, బ్లాక్-హెచ్, వార్డు నం.10లో ఎకరం స్థలాన్ని 1999లో కేటాయించడంతో పాటు జల మండలికి అప్పగించారు. కాగా, అనంతరం రిజర్వాయర్ నిర్మాణం కోసం మరోసారి స్థలం కావాలని కోరడంతో 1.20 గుంటల స్థలాన్ని కూడా జల మండలికి కేటాయించారు. కాగా, ఈ స్థలం పక్కన గతంలో జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ఉన్నప్పుడు తమ ప్లాట్లున్నాయంటూ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కోర్టులను ఆశ్రయించారు.
అయితే, అవన్నీ గుర్తింపు లేని ప్లాట్లు కావడంతో వాటిని రద్దు చేశారు. కాగా, పి.పార్థసారథి అనే వ్యక్తి తాను సర్వే నం. 129/105(403/53పీ) లో ఐదెకరాల స్థలం కొన్నానంటూ జల మండలికి కేటాయించిన స్థలాన్ని క్లెయిమ్ చేశాడు. అయితే, ఆ సర్వే నెంబర్లు ఇక్కడివి కావని, అతడు చూపిస్తున్నవి బోగస్ పత్రాలంటూ రెండేళ్ల క్రితం షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పార్థసారథి తదితరులపై కేసు నమోదయ్యింది. ఇదిలా ఉండగా, స్థలాన్ని సర్వే చేసి తమకు అప్పగించాలంటూ జల మండలి అధికారులు కోరడంతో షేక్‌పేట రెవెన్యూ అధికారులు రెండు వారాల క్రితం సర్వే చేసి సరిహద్దులు చూపించారు.
ఈ స్థలం చుట్టూ వెంటనే ప్రహరీ నిర్మించాలంటూ సూచించారు. ఈ మేరకు జల మండలి స్థలాల పరిరక్షణ బాధ్యతలు చూసే ఎస్టేట్ ఆఫీసర్‌కు నివేదిక పంపించారు. అయితే, స్థలాన్ని కాపాడుకోవడంలో జల మండలి అధికారుల నిర్లక్ష్యంతో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు రాత్రికి రాత్రే స్థలం చుట్టూ భారీ ప్రహరీ కట్టేశారు. స్థానికంగా దుండగులను పెట్టి ఎవరు రాకుండా బెదిరింపులకు గురిచేస్తున్నారు. జల మండలి ఎస్టేట్ అధికారుల నిర్లక్ష్యంతో సుమారు రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థలాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
రెడ్ హిల్స్‌లో పైపులైను పగలడం వల్లే..
ఖైరతాబాద్, డిసెంబర్ 19: జల మండలి రెడ్‌హిల్స్ పరిధిలోని ట్రంక్ మెయిన్ ఇన్లెట్ లైను పగలడం వల్లే తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఆ శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పైపులైను దెబ్బతిన్న విషయం వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా పేర్కొన్నామని, సంబంధిత ప్రజా ప్రతినిధులకు వాట్సాప్ ద్వారా విషయం తెలియజేశామన్నారు. ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహ సముదాయాలకు నీరు సరఫరాలో కొంత ఆలస్యంగా జరిగిందని, దీంతో వారికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం, యధావిధిగా నీటి సరఫరా జరుగుతుందన్నారు.
స్థలాన్ని సర్వే చేసి జల మండలికి అప్పగించాం
బంజారాహిల్స్ రోడ్ నం.10లోని తట్టిఖానా జల మండలి వద్ద 2.20 ఎకరాల స్థలాన్ని గతంలోనే జల మండలికి అప్పగించాం. ఇటీవల కొంతమంది ప్రైవేటు వ్యక్తులు స్థలంలోకి వస్తే వారిపై కేసు పెట్టాం. వారు చూపిన పత్రాలు బోగస్‌వి. సరిహద్దు విషయాన్ని నిర్ధారించాలన్న జల మండలి అధికారుల కోరిక మేరకు రెండు వారాల క్రితం సర్వే నిర్వహించి హద్దులు చూపించాం. వెంటనే ప్రహరీ గోడ కట్టుకుని స్థలాన్ని కాపాడుకోవాలని సూచించాం. స్థలం కాపాడుకునే బాధ్యత జల మండలి అధికారులదే.
– అనితా రెడ్డి, తహసీల్దార్, షేక్‌పేట మండలం;