సిటీ బ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగం పెంచింది. మొదటి దశలో హిమాయత్‌సాగర్, గండిపేట నుంచి బాపూఘాట్ దాకా 21 కిలోమీటర్లు పనులు చేసేందుకు చకచకా అడుగులు వేస్తున్నది. సుందరీకరణలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రూ.6,500 నుంచి రూ.7000 కోట్లను కేటాయిస్తామని పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఎంఆర్డీసీఎల్ చైర్మన్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే నిధులు సమకూర్చుకుంటున్నారు. కానీ బాధితులకు ఇవ్వాల్సిన పరిహారంపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడం లేదు.
తాజాగా రాష్ట్ర బడ్జెట్లో మూసీ సుందరీకరణకు రూ.1500 కోట్లను కేటాయిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అనంతరం మీడియా చిట్‌చాట్‌లో మూసీ ప్రాజెక్టును చేసి తీరతామని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ సుందరీకరణ కోసం ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు రూ.4100 కోట్ల రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన రూ. 1500 కోట్లు, ఏడీబీ ఇచ్చే రూ.4100 కోట్ల రుణంతో ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తిచేయాలని భావిస్తున్నట్లు తేలింది.
కానీ ముఖ్యమంత్రి చిట్‌చాట్‌లో, ఉప ముఖ్యమంత్రి బడ్జెట్లో గాంధీ సరోవర్‌లో భా గంగా ఇండ్లు, స్థలాలను కోల్పోతున్న బాధితుల గురించి ప్రస్తావించకపోవడం కొసమెరుపు. వారి అంచనా ప్రకారం సమకూర్చుకుంటున్న బడ్జెట్ కేవలం ప్రాజెక్టులోని నిర్మాణాలకేనని స్పష్టం అవుతున్నది. ముఖ్యమం త్రి చెప్పినట్లు స్థలం కోల్పోయిన వారికి స్థలం.. ఇల్లు కోల్పోయిన ఇల్లు ఇస్తామని చెప్పడం వట్టి మాటేనని తేలిపోయింది.
గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా మధు పార్క్రిడ్జ్ అపార్ట్మెంట్ సహా నిర్వాసితులందరికీ ఇంటికి ఇల్లు, స్థలానికి స్థలం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం కేవలం ప్రాజెక్టుకే నిధులు కేటాయించి బాధితులకు టీడీఆర్‌లు కట్టబెట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు స్పష్టం అవుతున్నది. టీడీఆర్‌లు ఇస్తే పరిహారం కింద ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన పని ఉండదని భావిస్తున్నట్లు సమాచారం.
టీడీఆర్ పేరిట ఒక కాగితాన్ని బాధితుల చేతిలో పెట్టి తమ చేతులు దులుపుకొనేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం చిట్చాట్లోని మాటలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకుంటే 17కు పైగా కాలనీలు, ఒక అపార్ట్మెంట్ సహా కొన్ని ఎకరాల భూములను కోల్పోతున్న కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రస్తుతం గాంధీ సరోవర్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం తీసుకునే భూములు మరింత విలువైనవి కావడంతో టీడీఆర్‌లు ఇస్తే వారికి తీరని నష్టం కలుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే టీడీఆర్‌లు బయట మార్కెట్లో సగం ధరకు కూడా అమ్ముడు కాని పరిస్థితి ఉన్నది. దీంతో ఏండ్ల తరబడి పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్న పేద, మధ్యతరగతి ప్రజలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడుతుంది. లోన్లకు ఈఎంఐలు కట్టలేక… టీడీఆర్‌లకు సరైన ధర రాక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.