మెహిదీపట్నం జూన్ 20: ఓ రౌడీషీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. వారం రోజుల వ్యవధిలో ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జరగడం కలకలం రేపింది. దక్షిణ, పశ్చిమ మండలం అదనపు డీసీపీ అష్వాక్ అహ్మద్ కథనం ప్రకారం…..మల్లేపల్లి ఆగాపురాలో నివసించే అలీం(34) పూల అలంకరణ వ్యాపారం చేస్తూ జీవించే వాడు. ఇతడిపై హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉంది. ఇదిలా ఉండగా, స్నేహితుడు ఒమర్‌తో అలీంకు తరచూ గొడవలు జరిగేవి. తాగిన మైకంలో అనేకసార్లు అలీం, ఒమర్‌ను ‘నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించేవాడు.
దీనిని మనసులో పెట్టుకున్న ఒమర్ తన స్నేహితులు సిరాజ్, గౌస్, పాషాలతో కలిసి అలీంను చంపాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి మల్లేపల్లి నోబుల్ టాకీస్ చౌరస్తా సమీపంలోని ఫీల్‌ఖానా రోడ్లో అలీంను పిలిచి ప్లాన్ ప్రకారం.. కత్తులతో పొడిచి హత్య చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అలీం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసును ఆసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్‌కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వారం రోజుల వ్యవధిలో ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలోనే రెండు హత్యలు జరగడం కలకలం రేపుతున్నది.