చిక్కడపల్లి, ఫిబ్రవరి 27: రైతుల వ్యవసాయ సంక్షేమానికి 20 శాతం బడ్జెట్ ను కేటాయించాలని పలువురు వక్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బడ్జెట్లలో కార్పొరేట్ శక్తులకు వరాలు రైతులకు భారాలు మోపారని మండిపడ్డారు. అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్), అఖిల భారత వ్యవసాయ కార్మిక సమైక్య (ఏఐఏడబ్ల్యుఎఫ్) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ‘’కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు-రైతుల వ్యవసాయంపై ప్రభావం” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం గురువారం బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్ లో నిర్వహించారు.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య, ఏఐఏడబ్ల్యుఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోనె కుమారస్వామి, ఏఐఏడబ్ల్యూయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ మనుగడకు దేశ అభ్యున్నతికి జీవనాధారమైన దేశీయ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించకుండా కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, రైతుల సంక్షేమాన్ని విస్మరించడం అన్యాయమన్నారు. ఏఐకేఎఫ్, ఏఐఏడబ్ల్యుఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య, వరికుప్పల వెంకన్నల అధ్యక్షతన వహించిన సమావేశంలో జక్కుల నరసింహ, ఏఐసీటీయూ రాష్ట్ర కార్యదర్శి రాయబండి పాండురంగం ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి, ఏపూరి సోమన్న, కుర్ర రవీందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, వరికెల కిషన్, మానయ్య, మోహన్ నాయక్, మారయ్య, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.