పట్టపగలే హత్యలు,కాల్పులు, దోపిడీలు,దొంగతనాలు, విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదా లు,ప దుల సంఖ్యలో మరణాలు,ఎటు చూసినా ఘోరకలి, అసలు ఏమైంది ఈ నగరానికి..రెండేండ్లలో పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు మారిపోయాయి. శాంతి భద్రతలు అదుపు తప్పా యా..నిఘా వ్యవస్థ నిద్రావస్థలోకి జారిపోయిందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
పోలీసు గస్తీ ఏమైపోయింది..నిఘా వ్యవస్థ ఎందుకు నీరుగారిపోతుంది.. అప్పుడు జరగని దోపిడీ, దొంగతనాలు, హత్యలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నా యి..అప్పుడు గంటలు, రోజుల్లోనే ఛేదించిన కేసులను ఇప్పుడెందుకు ఛేదించలేకపోతున్నారు.. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా ఉంటూ ఎన్నో సేవలకు సహకరించిన హాక్ ఐ యాప్‌ను మరుగున పడేశారు.
అన్ని వర్గాలకు సమ న్యాయం జరిగేలా రిసెప్షన్ మేనేజ్మెంట్, క్రైమ్ ట్రాకింగ్ తదితర అంశాలను సాంకేతికపరంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి, ప్రపంచ స్థాయిలోనే హైదరాబాద్ పోలీసులకు తీసుకువచ్చిన ప్రత్యేక గుర్తింపు కాంగ్రెస్ పుణ్యమా అని కనుమరుగైపోతోంది. నేరాలు జరుగుతున్న వాటిని ఛేదించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంబర్‌పేటలో వృద్ధ దంపతుల హత్య, అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల ఘటన, కేపీహెచ్బీలో వృద్ధ దంపతుల ఇంట్లో దోపిడీ ఘటన వంటి కేసులు మిస్టరీగానే మిగిలిపోయాయి. ట్రై కమిషనరేట్ల పరిధిలో జరగుతున్న హత్యలు, కాల్పులు, దోపిడీలు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు, అగ్ని ప్రమాదాలు, విద్యుదాఘాతాలతో నగరం అట్టుడికిపోతుంది. నగరం డ్రగ్స్‌కు కేంద్రంగా మారింది. ముంబై పోలీసులు వచ్చి హైదరాబాద్‌లో దాడులు చేసే పరిస్థితికి వచ్చింది. చర్లపల్లి పారిశ్రామిక వాడలో డ్రగ్స్ తయారు చేస్తున్న వ్యవహారాన్ని ముంబై పోలీసులు వెలుగులోకి తెచ్చారు. – ఫీచర్స్ స్టోరీ
ట్రై కమిషనరేట్ల పరిధిలోని చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సీసీ కెమెరాలను బాగు చేస్తామంటూ పోలీసులు ప్రకటించుకున్నా అది ప్రకటనకే పరిమితమైనది. సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే నెపంలో చాలా మంది పోలీసులు కేసుల ఛేదనలను పక్కన పెట్టేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో పోలీసులు సీసీ కెమెరాలతో పనిలేకుండా కేసులను ఛేదించేవారు. నేడు టెక్నాలజీకి అలవాటు పడిన పోలీసులు సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ కాల్ డేటా లభించలేదంటే నేడు పోలీసులు కేసులు ఛేదించలేని స్థితికి వెళ్లారని విమర్శిస్తున్నారు.
కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, అంబర్‌పేట, కుషాయిగూడ, జగద్గిర్గుట్ట వంటి ఘటనలతో నగరంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు గాని పెద్దలు గాని ఒంటరిగా ఉండాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. వృద్ధులకు రక్షణ కరువైంది. రోడ్లపై వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొంటారో.. చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కొని పోతారోననే భయంతో నగర వాసులు భయపడుతున్నారు. రోడ్లపై మందుబాబుల తిష్ట వేస్తున్నారు. గంజాయి బ్యాచ్‌లు హల్చల్ చేస్తున్నాయి. షీ టీమ్స్ నిద్రావస్థలో ఉన్నట్లు ఆరోపిస్తున్నారు.
దోపిడీ దొంగల ముఠాలకు గ్రేటర్ అడ్డాగా మారుతుంది. సులభంగా దోచుకోవచ్చనే భావనతో ఆయా రాష్ర్టాలకు చెందిన ముఠాలు తమ పని కానిచ్చేస్తున్నారు. దోచుకుపోవడం నిత్యకృత్యంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలోకి రాకుండా కట్టడి చేశారు. హైదరాబాద్ వైపు చూడాలంటేనే అంతర్రాష్ట్ర ముఠాలు భయపడే పరిస్థితి ఉండేది. కానీ నేడు పట్టపగలు తుపాకులతో హల్చల్ చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు.
తరుచుగా డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతున్నాయి. పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో పోలీసులు విఫమవుతున్నారు. టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీలు తమ నైపుణ్యాన్ని కోల్పోయాయి. గతంలో ఏ కేసునైనా 48 గంటల్లో హైదరాబాద్ పోలీసులు ఛేదించేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో క్షేత్ర స్థాయిలోని సిబ్బంది ఇష్టానుసారంగా పనిచేస్తున్నారు. ఇతర రాష్ర్టాల డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్‌ను సేఫ్ జోన్‌గా వాడుకుంటూ హైదరాబాద్ మీదుగా భారీ ఎత్తున డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నాయి.
కొందరు ఉన్నతాధికారులు, సిబ్బందిపై తరుచు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు వచ్చిన పలువురు సీఐలపై ఆయా సీపీలు చర్యలు తీసుకున్నారు. శివారు ప్రాంతాల్లో ల్యాండ్ సెటిల్మెంట్లు భారీగా పెరిగాయి. రాజకీయ నాయకుల అండదండలతో ఇష్టానుసారంగా కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారు. కొందరు పోలీసు అధికారులు తమ సామాజిక వర్గానికి అడ్డదారిలో న్యాయం చేస్తూ తమ రాజకీయ బాస్‌లను ప్రసన్నం చేసుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
సైబర్నేరాలను అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇతర రాష్ర్టాలు, దేశాలకు చెందిన సైబర్నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నేడు నామ మాత్రంగా కేసుల దర్యాప్తు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు ఫిర్యాదులతో కేసుల సంఖ్య పెరిగిపోతుంది, ఆయా కేసులను దర్యాప్తు చేసేందుకు సరిపోయిన సిబ్బంది లేకపోవడంతో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. సిబ్బంది కొరత ఒక కారణమైతే, కేవలం నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాదారుల వరకు వెళ్లి అక్కడితోనే దర్యాప్తును పోలీసులు ఆపేస్తున్నారు.