సిటీబ్యూరో/వెంగళ్రావునగర్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆషామాషీ పోటీ కాదని, బీఆర్ఎస్ పదేళ్ల వికాసానికి.. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల సంక్షోభానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని ఎవరి పాలన బాగుందో సరైన తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత జూబ్లీహిల్స్ ఓటర్లపై ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. జూబ్లీహిల్స్‌లోని నాలుగు లక్షల మంది ఓటర్ల వైపు రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది చూస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. బుల్డోజర్కు అడ్డొచ్చేది కారు గుర్తు మాత్రమేనని, ఈ బుల్డోజర్ సర్కార్‌కు బుద్ధి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్రకు శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా మంగళవారం సోమాజిగూడ డివిజన్లో కేటీఆర్ రోడ్‌షోకు హాజరై ప్రసంగించారు.
సోమాజిగూడలో కేటీఆర్ రోడ్ షో సూపర్‌హిట్ అయ్యింది. డివిజన్ నలుమూలల నుంచి జనం రోడ్‌షో మార్గానికి వెల్లువలా తరలివచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలు, బైక్‌ర్యాలీల ద్వారా సభాస్థలాలకు చేరుకున్నారు. మహిళలు బతుకమ్మలతో తరలివచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా దారులన్నీ గులాబీమయం అయ్యాయి. ఎల్లారెడ్డిగూడ హనుమాన్ ఆలయం నుంచి ఇమామ్‌గూడ చౌరస్తాలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి కేటీఆర్ రోడ్ షో నిర్వహించగా దారి పొడవునా కేటీఆర్‌పై శ్రేణులు, అభిమానులు పూలవర్షం కురిపించారు. దాదాపు గంట పాటు రోడ్ షో జరుగగా అడుగడుగునా ప్రజలకు కేటీఆర్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కేటీఆర్ చేసిన ప్రసంగం జనాన్ని ఆలోచింపజేయగా అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
రోడ్‌షో సందర్భంగా ప్రత్యేక స్క్రీన్లలో కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎండగట్టారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ వివరించారు. నిరుపేదలపై హైడ్రా భూతం విరుచుకుపడుతున్నదని, ఇళ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా తయారైందన్నారు. పుస్తకాలు తీసుకుంటామని చిన్నారులు బతిమిలాడినా బయటకు ఈడ్చి కూలగొట్టారని ఆయన మండిపడ్డారు. పేదల కోసమేనా హైడ్రా.. పెద్దలకు వర్తించదా? అని ప్రశ్నించినప్పుడు జనం కూడా హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌రెడ్డి, ఎల్ రమణ, సీనియర్ నాయకులు పి.విష్ణువర్దన్‌రెడ్డి, మహేశ్ యాదవ్, ప్రదీప్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.