‘కొందరు డ్రైవర్లు మృత్యుపాశాలుగా మారుతున్నారు. డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయి.. ఇతరుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. నగర రహదారులపై స్పీడ్ లిమిట్ నిబంధన ఉన్నప్పటికీ దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా దూసుకొస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్లపై సైతం వేగంగా వెళ్లడానికి యత్నిస్తున్నారు.
ఇలాంటి క్రమశిక్షణారాహిత్య డ్రైవింగ్‌తో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల హబ్సిగూడలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లోనూ అతివేగమే కారణంగా నిపుణులు చెబుతున్నారు. కారణమేదైనా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో మరొకరి ప్రాణం తీసి వారి కుటుంబానికి శోకం మిగిల్చిడం..తీవ్ర నేరంగా అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదుతో పాటు డ్రైవర్ల లైసెన్స్‌ల రద్దును పరిశీలిస్తున్నారు.
Driving Licence | సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): వాహనదారుల నిర్లక్ష్యంపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించే వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై, ట్రాఫిక్, రవాణా నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులు మొదటి కేటగిరీగా, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నవాటిని రెండో కేటగిరీగా వర్గీకరించి కేసులు నమోదు చేస్తున్నారు.
వాహనం నంబర్‌పై స్పీడ్ లేజర్ గన్ చిత్రీకరించిన దృశ్యాలను చూస్తూ అధిక సార్లు అతివేగంతో ప్రయాణించడాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించి.. లైసెన్స్ సస్పెండ్ చేయాలని రవాణాశాఖకు పంపుతున్నారు. లైసెన్స్ రద్దులో ఉన్నప్పుడు వాహనం నడుపుతూ దొరికితే జైలు శిక్ష కూడా పడే వీలుంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారుల్లో క్రమశిక్షణ పెంపొందించే అవగాహన కార్యక్రమాలను సైతం ఆర్టీఏ అధికారులు నిర్వహిస్తున్నారు.