Mylardevpally | మైలార్‌దేవ్‌పల్లి, జూలై 11: ఆ రహదారి ఎప్పుడు రద్దీగా ఉంటుంది… అనేక మంది స్థానిక ప్రజలు కాలినడకన రోడ్డు దాటి కంపెనీల్లో విధులకు వెళ్తుంటారు. ఆదమరిస్తే చాలు అటుగా వెళ్తున్న వాహనాలు వారిని ఢీకొడుతూ వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు గాయాలకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ ప్రాంతంలో దారి దాటేందుకు సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో వేగంగా వచ్చే వాహనాల వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ దుర్గానగర్ నుంచి ఆరాంఘర్ వరకు ఇన్నర్ రింగ్ రోడ్డులో గల సెంట్రల్ డివైడర్ అభివృద్ధి పనులు గత కొంత కాలంగా కొనసాగుతున్నాయి. అక్కడ రోడ్డు దాటేందుకు ఎల్లమ్మ దేవాలయం ఎదురుగా డివైడర్ మధ్యలో నడకదారి వదిలారు. అనేక మంది కార్మికులు, పాదాచారులు రోడ్డు దాటి తమతమ విధులకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరేందుకు ప్రయత్నిస్తుంటారు. దుర్గానర్ నుంచి వేగంగా దూసుకొచ్చే వాహనాలు,ఆనంద్‌నగర్ వైపు నుంచి అంతే వేగంగా వచ్చే వాహనాలు పాదచారులను గ్రహించే వీలుగా కనీస సూచిక బోర్డులు, వేగ నిరోధక సూచికలు, జీబ్రా క్రాసింగ్ లేకపోవడంతో ప్రతి రోజు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు మహిళా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇక్కడ రోడ్డు ప్రమాదాలకు గురై వికలాంగులుగా మారిన వారితో పాటు ప్రాణాలు కోల్పొయిన కార్మికుల సంఖ్య కూడా అధికంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనేక ప్రమాదాలు…
ఆరాంఘర్ నుంచి దుర్గానగర్ వైపు వెళ్లే ఇన్నర్ రింగ్ రోడ్డులో గల మార్కండేయనగర్ ఎల్లమ్మ దేవాలయం ఎదురుగా కాలినడకన రోడ్డు దాటుతున్న మహిళా కార్మికురాలిని గుర్తు తెలియని వాహనం గురువారం ఢీకోనడంతో ఆమెకు తీవ్ర గాయాలైయ్యాయి. కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో బాబుల్‌రెడ్డినగర్‌లో ఉంటున్న పూనం పని చేస్తుంది. ఆమె రోడ్డు దాటుతున్న సమయంలో వాహనం ఢీకోట్టడంతో కిందపడి తీవ్ర గాయాలకు గురైంది. స్థానికులు స్పందించి వెంటనే 108కి సమాచారం అందించడంతో సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళకు మోచేతి కింది భాగం, కాలి పిక్క భాగంలో సుమారు రెండు ఇంచుల మేర చర్మం ఎగిరిపడిపోయింది. ఇలా అనేక ప్రమాదాలు జరుగుతున్న అధికారులు స్పందించకపోవడం గమనార్హం అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.