శామీర్‌పేట, ఆగస్టు 15 : రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారి అచ్చాయిపల్లి చౌరస్తా వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ బ్యాగరి నవీన్‌కుమార్, కండక్టర్ బాలనర్సయ్య(49) మంగళవారం సికింద్రాబాద్‌కు వస్తున్నారు. అచ్చాయిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికులను దించడానికి రోడ్డు పక్కన బస్సు ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బొలోరా వాహనం ఢీ కొట్టింది. దీంతో బస్సుకు ఏమైనా జరిగిందా.. అని డ్రైవర్, కండక్టర్ పరిశీలిస్తున్నారు. అదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డు పక్కన ఉన్న కండక్టర్, డ్రైవర్, ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు బలోరా వాహనానికి తగలడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడ్డ కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ చేయి విరిగి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శవ పంచనామా నిర్వహించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గజ్వేల్- ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో సేఫ్టీ వార్డన్ ఆస నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.