సిటీబ్యూరో, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాద బాధితులను దవాఖానకు తీసుకెళ్తే పోలీసులు విచారణ పేరుతో ఇబ్బంది పెడతారనే భయం..అనుమానం అవసరం లేదు. 2019 మోటర్ వెహికిల్ యాక్ట్ చట్టం ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తీసుకువచ్చే వారిని ఇబ్బంది పెట్టొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా గాయపడిన వ్యక్తిని దవాఖాన వైద్యులు ముందుగా చికిత్స చేయాలి. దవాఖాన వారు తిరస్కరించొద్దని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కాబట్టి ఎవరూ కూడా ఇప్పటి వరకు ఉన్న ఈ భయాన్ని తీసేయండి. సహాయం చేసి ఓ ప్రాణాన్ని కాపాడండని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పిలుపు నిచ్చారు. సోమవారం గచ్చిబౌలి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన రోడ్డు భద్రతతో పాటు గాయపడిన వ్యక్తులను సకాలంలో దవాఖానకు తీసుకువెళ్లి ప్రాణాలను నిలబెట్టిన పౌరులను ఆయన సన్మానించారు.ఈ సందర్భంగా పలువురు వాహనదారులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేసి పోలీసులు అందిస్తున్న మద్దతును కొనియాడారు.
నేను కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి ఢీకొట్టాడు. అతను కిందపడి తీవ్రగాయాలకు గురయ్యాడు. వెంటనే అతన్ని స్థానికంగా దవాఖానకు తీసుకెళ్లాను. వారు అక్కడ తీసుకోలేదు. అలా మూడు దవాఖానలకు తిరిగాను. చివరకు ఈఎస్ఐ దవాఖానలో చేర్పించాను. అయితే కుటుంబ సభ్యులు తాను ప్రమాదానికి కారకుడని భావించారు. చివరకు పోలీసు సమాచారం ఇచ్చాను. పెట్రోలింగ్ అధికారులు వచ్చి జరిగిన విషయాన్ని స్పష్టం చేశారు.- రామ్ నివాస్
నానక్‌రాంగూడ వద్ద కారును మలుపు తీసుకుంటున్నాను. వెనకాల నుంచి వచ్చిన అతను నా కారును ఢీకొట్టి స్పృహ తప్పాడు. వెంటనే సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లాను. పోలీసులకు సమాచారం ఇచ్చాను. 15 నిమిషాల్లో పోలీసులు వచ్చారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. నేను ఇంటికి వెళ్లిపోయాను. రెండు రోజుల తర్వాత పోలీసు అధికారులు ఫీడ్ బ్యాక్ అంటూ ఫోన్ చేశారు. మా సిబ్బంది ఎలా వ్యవహరించారు. ఏమైనా ఇబ్బంది పెట్టారా అంటూ సమాచారం తీసుకున్నారు. అసలు ఇన్ని రోజులు నాకు పోలీసులంటే ఓ తప్పుడు అభిప్రాయం ఉండేది. అది ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. -నీల్, నానక్‌రాంగూడ వాసి