సిటీబ్యూరో, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ):ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో కరెంట్ మీటర్లు గిరగిర తిరుగుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఫిబ్రవరి మొదటి రెండువారాలు సగటున డిమాండ్ 60 మిలియన్ యూనిట్లు నమోదు కాగా, తాజాగా 73 మిలియన్ యూనిట్లకు చేరింది.
ఫిబ్రవరిలోనే ఏప్రిల్ డిమాండ్..
సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ గతంలో ఏప్రిల్లో నమోదైన గరిష్ఠ డిమాండ్ 3435 మెగావాట్లు దాటి ప్రస్తుతం ఈ ఫిబ్రవరిలో 3455 మెగావాట్ల డిమాండ్ నమోదవుతోంది. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ల్లో ఏ మేరకు డిమాండ్ నమోదవుతుందోనన్న ఆందోళనలో సిబ్బంది ఉన్నారు. మే మొదటి వారానికి రోజుకు సగటున 100 ఎంయూలు దాటే అవకాశం ఉన్నట్లుగా డిస్కం అంచనా వేస్తోంది. విద్యుత్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ ఇంజినీర్లలో ఆందోళన మొదలైంది. వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం డిస్కం ముందస్తు లైన్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టింది.
లైన్ క్లియరెన్స్ ఆపేనా..
సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు , డీటీఆర్లలో ఆయిల్ లీకేజీల నియంత్రణ, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, లూజులైన్లను సరిచేయడం, దెబ్బతిన్న ఇన్సులేటర్లను మార్చడం, ఎర్తింగ్ సిస్టం పకడ్బందీగా ఉండేలా చర్యలు చేపట్టారు. జనవరి చివర, ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి చేయాల్సిన లైన్ క్లియరెన్స్ పనులు ఇంకా గ్రేటర్ వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. మార్చి మొదటివారంలో ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈ పనులు నిలిపివేస్తారా.. లేక సమ్మర్ మొత్తం చేస్తారా అంటూ స్థానికుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బందికి వ్యంగ్యంగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
క్షేత్రస్థాయిలో సీఎండీ పర్యటన
సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులను పూర్తిచేయడంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇంజినీర్లతో పాటు క్షేత్రస్థాయిలో సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పర్యటిస్తున్నారు. ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తూ ఫైల్స్ క్లియరెన్స్ లేని చోట సీరియస్ అవుతున్నారు. పనులు పూర్తికాని చోట వెంటనే పూర్తి చేయాలని చెబుతున్నారు. అయితే శివారు ప్రాంతాల్లో కనెక్షన్లు పెరగడం, డిమాండ్ పెరుగుతుండడంతో లోడ్ అధికమవుతోంది.