ఫిబ్రవరి 6న నందగిరిహిల్స్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో భూపేందర్షా అనే నేపాలీ యువకుడు.. మిగతా పనివారికి మత్తుమందు ఇచ్చి దాదాపు రూ.2కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. మార్చ్ 14న జూబ్లీహిల్స్‌లో మరో వ్యాపారి ఇంట్లో చేరి ఇద్దరు నేపాలీలు యజమాని ఇంట్లో లేని సమయంలో లాకర్లు పగులగొట్టి రూ.3కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు. మూడునెలల కిందట కూకట్‌పల్లిలోని ఓవ్యాపారి ఇంట్లో ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు యువకులు పనివాళ్లుగా చేరి యజమాని భార్య ఇంట్లో ఒకతే ఉన్న సమయంలో కుక్కర్‌తో తలపై బాది అంతమొందించి చేతికందిన సొత్తుతో పరారయ్యారు.
ఇవి హైదరాబాద్ నగరంలో వరుసగా జరిగిన నేపాల్‌తో పాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన గ్యాంగులు పనిమనుషులుగా చేరి చేసిన ఘాతుకాలు. హైదరాబాద్‌లో కొందరు పనిమనుషుల ముసుగులో చేరుతున్న నేపాలీల దొంగతనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. యజమాని వద్ద నమ్మకం సంపాదించుకునేంతవరకు వేచి చూసి ఆ తర్వాత అవకాశం లభించగానే అందినకాడికి దోచుకుని స్వదేశానికి పారిపోతున్నారు. దీనికోసం కొన్ని ముఠాలుగా వచ్చి దేశంలోని పలు మహానగరాల్లో ఉంటూ అదనుచూసి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
మే 8న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో పనిచేస్తున్న నేపాలీయువతి మరో ముగ్గురితో కలిసి యజమాని భార్యను హత్య చేసి నగదు, నగలతో ఉడాయించడం సంచలనం సృష్టించింది.
సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో పనిమనుషులకు విపరీతంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇంటా బయటా సహాయకులుగా పనిచేసేందుకు స్థానికులు పెద్దమొత్తంలో జీతాలు ఆశిస్తున్నారు. ప్రధానంగా మహానగరంలో నిర్మాణరంగం, వ్యాపారాలు, ఇళ్లల్లో వంట , ఇతర పనులకోసం పనివాళ్ల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నేపాల్, ఇతర రాష్ర్టాలకు చెందిన పలువురు సెలవులు తీసుకోకుండా తక్కువ వేతనాలకు ఎక్కువ పనిచేస్తారనే ఉద్దేశంతో యజమానులు వారినే పనిలో పెట్టుకుంటున్నారు. వారి కనీస వివరాలు కూడా సేకరించడం లేదు. ఇదే అవకాశంగా యజమానులు ఏ పనిచెప్పినా చేస్తూ కొన్నాళ్లు నమ్మకంగా ఉంటున్న పనిమనుషులు ఆ తర్వాత తమ నిజస్వరూపాన్ని చూపిస్తున్నారు.
ఇంట్లో ఎవరూ లేని సమయం, వృద్ధులున్నప్పుడు దాడిచేసి దోపిడీ చేస్తున్నారు. కొందరు మాత్రం కేవలం దొంగతనాల కోసమే ఇళ్లల్లో పనిలో చేరుతున్నారు. గత ఏడాది కాచిగూడలో వ్యాపారి ఇంట్లో చోరీ ఇందుకు నిదర్శనం. వ్యాపారి కుటుంబానికి మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత భారీగా సొత్తు కాజేశారు. ఈ కేసులో నిందితులు ఇప్పటివరకు దొరకలేదు. గతం లో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన రాజస్థాన్‌కు చెందిన ముఖియాగ్యాంగ్ తరహాలోనే ఇప్పుడు ఈ నేపాలీ ముఠాలు సవాల్ విసురుతున్నాయి. అయితే నేపాలీ గ్యాంగ్ వ్యవహారం అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉండడంతో పోలీసులకు దర్యాప్తు చాలా కష్టంగా మారుతోంది. నిందితులు నేపాల్‌కు పారిపోతే వారిని తీసుకురావడం కష్టంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ ముఠాలను పట్టుకునేదుకు నగరపోలీసులు ఆపరేషన్ నేపాల్ పేరుతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. గత కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని అరెస్ట్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.
నేపాల్ పని మనుషులతో జాగ్రత్త..!
జూబ్లీహిల్స్ ఘటన తర్వాత ఇంట్లో పని మనుషులుగా పెట్టుకునే సమయంలో నేపాల్ నుంచి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండు నెలలుగా పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజలు ఇంకావారిని పనిలో కొనసాగించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నగరంలో ఘటనల నేపథ్యంలో ఇంట్లో పని లో పెట్టుకునే వ్యక్తుల నేర చరిత్ర, ఇతర వివరాలన్నీ యజమానులు కచ్చితంగా తెలుసుకోవాలంటూ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినా యజమానులు మాత్రం కనీసం జాగ్రత్తలు తీసుకోవడం లేదంటూ పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నా వారి నిఘా వైఫల్యాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇంట్లో చేరే పనిమనుషుల విషయంలో తామేం చేస్తామంటూ తమవైఫల్యా న్ని కప్పి పుచ్చుకుంటున్నారే తప్ప ఎవరు నగరంలోకి వస్తున్నారు. అసలు వీరి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, గతంలో నగరంలో జరిగిన ఘటనల నేపథ్యంలో వీరి కదలికలు ఎలా ఉన్నాయనే అంశాలపై పోలీసు నిఘా కొరవడింది. జూబ్లీహిల్స్ ఘటనలోనూ నిందితులు ముం దుగా రెక్కీ నిర్వహించినా పోలీసుల దృష్టిపడలేదంటే కాలనీలో ఎప్పటికప్పుడు నిఘాపెట్టాల్సిన పోలీసు సిబ్బంది ఏంచేస్తున్నదనే ప్రశ్నలు సాధారణ ప్రజలనుంచి వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లుగా నేపాలీ ముఠాల దొంగతనాల కేసులు రాష్ట్రంలో పెరుగుతుండడం కూడా పోలీసుల్లో ఆందోళన కలిగిస్తోంది.
