సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశంపై మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగరానికి దూరంగా ఇండ్లు నిర్మించడం వల్ల పేదల జీవనోపాదికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంటూ ఇకపై లబ్ధ్దిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రభుత్వ భూములు, మురికివాడలు, భూదాన్ భూములు శిథిలావస్థలో ఉన్న పాత హౌసింగ్ కాలనీలను గుర్తించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించారు.
హైదరాబాద్ పరిధిలో ఇండ్ల స్థలాలు కల్గి అర్హులైన వారికి ఈ నెలఖరులోగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అందజేయాలని దేశించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి లబ్దిదారులను గుర్తించాలని మంత్రి స్పష్టం చేశారు. అలాగే కాలనీలో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచనలు చేశారు. మల్కాజిగిరి పరిధిలో యుఎల్‌సీ భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో స్పీకర్ జి.ప్రసాద్‌కుమార్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌తో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.